వెల్‌డన్ హోంగార్డ్.. కారు దిగొచ్చి అభినందించిన హైకోర్టు సీజే
Published on: Fri Apr 8, 2022 3:19PM
జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ప్రోటోకాల్‌లో టాప్ లెవెల్. అంతటి అత్యున్నత హోదాలో ఉన్న ఆయన.. నడిరోడ్డు మీద సడెన్‌గా తన కారు ఆపారు. పూలబొకేతో కారు దిగారు. అక్కడ జంక్షన్లో డ్యూటీలో ఉన్న హోంగార్డును నవ్వుతూ పలకరించారు. ఆ పూలబొకేను హోంగార్డుకు అందించి.. వెల్‌డన్.. బాగా పని చేస్తున్నావంటూ అభినందించారు. ఈ అరుదైన ఘటన హైదరాబాద్ అబిడ్స్‌లో జరిగింది. ప్రశంసలు అందుకున్న ట్రాఫిక్ పోలీసును, ఆ చిన్న ఉద్యోగి పని తీరును గుర్తించి అభినందించిన సీజేను అంతా మెచ్చుకుంటున్నారు. వారి గురించే చర్చించుకుంటున్నారు.
అతని పేరు అష్రాఫ్ అలీ. ట్రాఫిక్ విభాగంలో హోంగార్డుగా చేస్తున్నారు. బషీర్‌బాగ్‌లోని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం కూడలిలో విధులు నిర్వహిస్తుంటారు. అసలే, ఫుల్ రద్దీగా ఉండే జంక్షన్ అది. వీఐపీల రాకపోకలూ ఎక్కువే. అందుకే, అనుక్షణం అలర్ట్‌గా ఉంటాడు అఫ్రాఫ్. ట్రాఫిక్ జామ్స్ కాకుండా.. వాహనాలను క్రమబద్దీకరించడంలో ఎక్స్‌పర్ట్. అలా డైలీ డైనమిక్ డ్యూటీలో బిజీగా ఉంటుంటాడు. ఆ హోంగార్డ్ వాహనాలు మినహా.. అందులో ఎవరున్నారనే విషయం ఆయన పట్టించుకోడు. కానీ, నిత్యం అదే దారిలో వెళ్లే హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ మాత్రం ఆ హోంగార్డు పనితీరును రోజూ గమనిస్తుంటారు. అరే, భలేగా పని చేస్తున్నాడే.. ట్రాఫిక్‌ను భలే క్లియర్ చేస్తున్నాడే.. అని అనుకుంటూ ఉండేవారు.
జస్ట్ మనుసులో అనుకోవడం మాత్రమే కాదు.. తాజాగా అదే రూట్‌లో వెళ్తూ ఆ హోంగార్డును చూసి తన కారును ఆపించారు సీజే. కారు దిగొచ్చి.. రోడ్డుపై డ్యూటీ చేస్తున్న హోంగార్డు అష్రాఫ్ అలీ దగ్గరికి వెళ్లి.. పుష్పగుచ్చం ఇచ్చి.. అతని సేవలను అభినందించారు. పెద్ద సారు పెద్ద మనుసుకు అష్రాఫ్.. ఫుల్ ఖుషీ అయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ తనను అభినందించడం గర్వంగా ఉందని అష్రాఫ్ అలీ ఆనందం వ్యక్తం చేశారు. మరింత ఉత్సాహంగా తన విధులు నిర్వర్తిస్తానని చెప్పారు. విషయం తెలిసి ఆ హోంగార్డును ట్రాఫిక్ విభాగం ఉన్నతాధికారులు సైతం అభినందించారు.


