TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఐపాయ్‌.. RRR లేకుండానే అసెంబ్లీ ముగిసిపాయ్‌...

Published on: Tue Mar 15, 2022 3:40PM

హైకోర్టు చెప్పినా RRRకు న్యాయం జ‌ర‌గ‌లేదు. స్పీక‌ర్‌ను క‌ల‌వాల‌ని.. ధ‌ర్మాస‌నం సూచించినా.. క‌లిసేందుకు ఆయ‌న స‌మ‌యం ఇవ్వ‌లేదు. తెలంగాణ అసెంబ్లీ మొద‌టిరోజే.. మొద‌టి గంట‌లోనే బహిష్క‌ర‌ణ వేటుకు గురైన ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు మ‌ళ్లీ స‌భ‌లో అడుగుపెట్ట‌కుండానే.. స‌భ స‌మాప్తమ‌వ‌డం ప్ర‌భుత్వ పంతానికి, ప‌ట్టుద‌ల‌కు నిద‌ర్శ‌నం అంటూ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ మ‌ధ్య‌లో అనేక రాజ్యాంగ- స‌భా నియ‌మాల ఉల్లంఘ‌న‌ల ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. హైకోర్టులోనూ సింగిల్ జ‌డ్జ్‌.. డివిజ‌న్ బెంచ్.. ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. రాజాసింగ్‌, ర‌ఘునంద‌న్‌రావు, రాజేంద‌ర్‌లపై వేటు వేయ‌డంపై తెలంగాణ‌లో దుమారం చెల‌రేగింది. చివ‌రి వ‌ర‌కూ న్యాయ పోరాటం చేసిన ఆ ముగ్గురు.. స‌ర్కారుకు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించార‌నే అంటున్నారు. 

అసెంబ్లీలో నిర‌స‌న తెలిపితే.. కాసేపు స‌భ‌ను వాయిదా వేస్తారు. అలా రెండు మూడు సార్లు చేశాక‌.. అప్ప‌టికీ ప‌రిస్థితి అదుపులోకి రాక‌పోతే.. ఆ స‌భ్యుల‌ను ఒక‌రోజు స‌స్పెండ్ చేయ‌డం గ‌తంలో చూశాం. కానీ, ఈసారి తెలంగాణ అసెంబ్లీలో కొత్త శైలి క‌నిపించింది. అసెంబ్లీ బెల్ మోగ‌గానే.. ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు నిర‌స‌నకు దిగారు. ఇక అంతే. కాసేప‌టికే ఆ ముగ్గురిని స‌భా సెష‌న్ మొత్తం బ‌హిష్క‌రిస్తూ స్పీక‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. వెంట‌నే త్రిబుల్ ఆర్ ను హౌజ్ నుంచి బ‌య‌ట‌కు పంపించేశారు. 

సైలెంట్‌గా ఎవ‌రింటికి వాళ్లు వెళ్లిపోతే.. వాళ్లు బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుక‌వుతారు? అందులోనూ ముగ్గురూ ముగ్గురే. ఫైర్‌బ్రాండ్ లీడ‌ర్లే. రాజాసింగ్‌, ర‌ఘునంద‌న్‌, ఈట‌ల రాజేంద‌ర్‌.. త‌గ్గేదేలేదంటూ హైకోర్టును ఆశ్ర‌యించారు. న్యాయ‌స్థానంలో సుదీర్ఘంగా పోరాడారు. మ‌ళ్లీ స‌భ‌లో అడుగుపెట్ట‌లేక‌పోయినా.. స్పీక‌ర్ మ‌రోసారి ఇలాంటి వేటు వేయాలంటే.. కాస్త వెన‌కాముందు ఆలోచించేలా మాత్రం హైకోర్టు ద్వారా ఒత్తిడి తీసుకురాగ‌లిగారు. చివ‌రాఖ‌రికి ఓడి గెలిచారు ఆ ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు.

అంత‌కుముందు.. RRR బ‌హిష్క‌ర‌ణ‌ వేటుపై చట్టసభల సంరక్షకుడిగా స్పీకర్‌ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేలా సముచిత నిర్ణయం తీసుకుంటారని హైకోర్టు ఆశాభావం వ్యక్తం చేసింది. రాజ్యాంగ అత్యున్నత హోదాలో ఉన్న స్పీకర్‌కు ఎలాంటి ఆదేశాలివ్వబోమని త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం తెలిపింది. అయితే.. మంగళవారం చివరి రోజు కావడంతో స్పీకర్‌ ఒక నిర్ణయం తీసుకోవాల‌ని హైకోర్టు ఆదేశించినా.. ఆ మేర‌కు సానుకూల నిర్ణ‌యం మాత్రం రాలేదు. 

"ముగ్గురు ఎమ్మెల్యేలూ స్పీకర్‌ను అభ్యర్థిస్తే సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తారనే ఆశ మాకుంది. ఎమ్మెల్యేల అభ్యర్థనను శాసనసభ సమావేశాల ప్రారంభానికి ముందే వినాలి. సమయానుకూలంగా స్పందించి పార్లమెంటరీ సంప్రదాయాలు అమలయ్యేలా చూడటం ద్వారా స్పీకర్‌ ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా ఉంటారని ఆశిస్తున్నాం" అని సోమ‌వారం హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎమ్మెల్యేల పట్ల వ్యవహరించిన తీరు చూస్తే అధికరణలు 14, 19, 21 ప్రకారం సభ్యుల హక్కులకు ఉల్లంఘన జరిగినట్టు ఉంద‌ని అభిప్రాయ‌ప‌డింది. ఒక రోజుకు మించి సస్పెండ్‌ చేయడంగాని, వారిపట్ల వ్యవహరించిన తీరుగాని కొంతమేర చట్ట విరుద్ధమని అనిపించవచ్చని వ్యాఖ్యానించింది. ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలవాలని ధర్మాసనం సూచించ‌గా.. ఆ ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు మంగ‌ళ‌వారం స్పీక‌ర్‌ను క‌లిసే ప్ర‌య‌త్నం చేసి విఫ‌ల‌మ‌య్యారు. బ‌హిష్క‌ర‌ణ వేటు నుంచి విముక్తి ల‌భించ‌క‌పోయినా.. మ‌రోసారి వేటు వేయాలంటే ఉలిక్కిప‌డేలా చేయ‌డంలో మాత్రం బీజేపీ ఎమ్మెల్యేలు ముగ్గురు స‌క్సెస్ అయ్యార‌నే చెప్పాలి.