అప్పుడు విశాఖ వైపు కన్నెత్తి చూడని జగన్.. ఇప్పుడు మంచి చేస్తాడంటే నమ్మాలా?

కొద్ది రోజులుగా ఏపీని పట్టి కుదిపేస్తున్న అంశం రాజధాని తరలింపు. అసెంబ్లీ సాక్షిగా మూడు రాజధానుల ప్రతిపాదన అంశాన్ని సీఎం వైఎస్ జగన్ తెరమీదకు తీసుకురావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామని చెప్పడం.. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీలు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ఇక రాజధాని తరలింపు ఖాయమని తెలుస్తోంది. దీంతో రాజధాని తరలింపుని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వారికి టీడీపీ పూర్తిగా మద్దతిస్తూ ఉద్యమిస్తోంది. 

అయితే టీడీపీకి చెందిన కొందరు విశాఖ నేతలు మాత్రం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ప్రకటించారు. స్థానిక ప్రజల మెప్పు కోసమే ఆ ప్రాంత టీడీపీ నేతలు కొందరు జగన్ నిర్ణయాన్ని స్వాగతించారని టీడీపీ శ్రేణులు భావించాయి. మరోవైపు అసలు జగన్ విశాఖకు మంచి చేస్తానంటే గుడ్డిగా ఎలా నమ్ముతున్నారంటూ  కొందరు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు గతంలో విశాఖపై జగన్ ప్రదర్శించిన తీరుని గుర్తుచేస్తున్నారు. 2014 లో హుద్‌హుద్ తుఫాను విశాఖని అతలాకుతలం చేసింది. ఆ సమయంలో అప్పటి సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి విశాఖకు అండగా ఉన్నారు. కొద్దిరోజులపాటు విశాఖలోనే ఉండి అధికారులని ఉరుకులు పెట్టి పనులు చేయించారు. తుఫాను వచ్చి కళ తప్పిన విశాఖకు.. మళ్లీ కళ తెప్పించారు. విశాఖ ప్రజల కళ్ళల్లో ఆనందం తెప్పించారు. కానీ అప్పుడు వైఎస్ జగన్ మాత్రం విశాఖకు అండగా నిలబడలేదు. దానికి కారణం ఆయనకు విశాఖ ప్రజలపై ఉన్న కోపమే అని అప్పుడు ప్రచారం జరిగింది.

2014 ఎన్నికల్లో జగన్ తల్లి విజయమ్మ విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత హుద్‌హుద్ తుఫాను విశాఖను కుదిపేసింది. విజయమ్మని ఓడించిన పాపం విశాఖకు తగిలింది అంటూ ఆ సమయంలో కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టి పైశాచిక ఆనందం పొందారు. ఇక జగన్ అయితే విశాఖ వైపు తిగిరిచూడలేదు. తన తల్లిని ఓడించారన్న కోపంతోనే జగన్ వారిని పరామర్శించలేదు, వారికి అండగా నిలబడలేదని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం గెలిచినా ఓడినా ప్రజలకు అండగా ఉండాలి. 2009 కర్నూల్ లో వరదలు వచ్చిన సమయంలో ప్రతిపక్షంలో ఉన్నా కూడా చంద్రబాబు ప్రజలకు అండగా నిలబడి.. వారికి తన తరఫున, తన పార్టీ తరఫున ఎంతో సేవ చేశారు. కానీ జగన్ మాత్రం తన తల్లిని ఓడించారన్న కోపంతో... ప్రజలు కష్టాల్లో ఉంటే వాళ్ళ కనీళ్ళు తుడవడం కాదు కదా.. కనీసం పలకరించలేదు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వీటిని గుర్తు చేస్తూ ఇప్పుడు జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న వారిని ప్రశ్నిస్తున్నారు కొందరు. అప్పుడు విశాఖ ప్రజలు కష్టాల్లో ఉంటే కనీసం కన్నెత్తి చూడనివాడు.. ఇప్పుడు విశాఖకు మంచి చేస్తానంటే ఎలా నమ్ముతున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. జగన్ కేవలం చంద్రబాబు మీద కోపంతోనే రాజధానిని అమరావతి నుండి విశాఖకు తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. విజయమ్మ ఓటమిని గుర్తు పెట్టుకొని విశాఖపై ప్రతీకారం తీర్చుకునే కుట్ర చేసినా ఆశ్చర్యం లేదని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు రాజధాని విషయంలో జగన్ మనసులో ఏముందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం జగన్ కి మద్దతుగా కొందరు, జగన్ కి వ్యతిరేకంగా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.