తృప్తి దేశాయ్ మరో విజయం.. తరువాత టార్గెట్ శబరిమల..

 

భూమాత బ్రిగేడ్ సంస్థ అధినేత్రి తృప్తీ దేశాయ్ ఇప్పటివరకూ పలు ఆలయాల్లో ప్రవేశించి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మరో విజయం మూటగట్టుకున్నారు తృప్తీ దేశాయ్. ఇప్పటికే శనిసింగనాపూర్, నాసిక్ లోని త్రయంబకేశ్వరాలయంలోకి వెళ్లడానికి అనుమతి సంపాదించిన తృప్తీ దేశాయ్ ముంబైలోని హజీ అలీ దర్గాలోకి కూడా మహిళలను అనుమతించాలని ఉద్యమం చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆమె కోర్టును కూడా ఆశ్రయించారు. ఇక దీనిపై విచారించిన కోర్టు దర్గాలోకి మహిళల ప్రవేశంపై నిషేధం ఎత్తివేస్తున్న‌ట్లు తీర్పు వెల్లడించింది. దర్గాలోకి మహిళలు ప్రవేశించకుండా నిషేధం విధించడం వారి ప్రాథమిక హక్కులను భంగం కలిగించినట్లేనని.. పురుషులతో సమానంగా మహిళలు కూడా దర్గాలోనికి వెళ్లొచ్చని, ఈ క్రమంలో మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో భూమాత బ్రిగేడ్ సభ్యులు సంబరాలు చేసుకుంటున్నారు. అంతేకాదు తదుపరి లక్ష్యం శబరిమల అంటూ తృప్తీ దేశాయ్ తెలిపారు.


మరోవైపు బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై హజీ అలీ దర్గా ట్రస్ట్‌ సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు అమలును ఆరు వారాల పాటు నిలుపుదల చేశారు.