TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మారని ట్రంప్ తీరు.. మళ్లీ పెచ్చరిల్లుతున్నఉద్రిక్తతలు

Published on: Sat Apr 18, 2026 12:39PM

పశ్చిమాసియాలో  ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఓ వైపు శాంతి చర్చలు జరుగుతున్నా.. కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నా యుద్ధ భయం మాత్రం తొలగడం లేదు.  ముఖ్యంగా అమెరికా  విధానాలు,  తీసుకుంటున్న నిర్ణయాలు అగ్నికి ఆజ్యంపోసినట్లు ఉంటున్నాయి.  శాంతిని నెలకొల్పాల్సిన  అగ్రరాజ్యం యుద్ధాన్ని ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్న తీరు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.   ఇరాన్ విషయంలో అమెరికా అంచనాలు తలకిందులవ్వడంతో ట్రంప్ సంయమనం కోల్పోయినట్లు కనిపిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇరాన్ సైనిక శక్తిని, ఆ దేశ అంతర్గత పటుత్వాన్ని అగ్రరాజ్యం అంచనా వేయడంలో పూర్తిగా విఫలం అయ్యింది.  ఏళ్ల తరబడి విధిస్తున్న ఆర్థిక ఆంక్షలు, అంతర్గత తిరుగుబాట్లతో ఇరాన్ బలహీనపడిందన్న గుడ్డి నమ్మకంతో అమెరికా దుందుడుకుగా వ్యవహరించి దెబ్బతిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. 

అమెరికా తన మిత్రదేశమైన ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసం వ్యవహరిస్తున్న తీరు మొత్తం ప్రపంచాన్నే ఇబ్బందుల్లోకి నెట్టేసిందంటున్నారు.  ముఖ్యంగా లెబనాన్, ఇజ్రాయిల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి మధ్యవర్తిగా వ్యవహరించి సక్సెస్ అయిన తరువాత కూడా ఇరాన్ విషయంలో అగ్రరాజ్యాధినేత ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా ముసురుకోవడానికి కారణమౌతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేసినట్లు ఇరాన్ ఇలా ప్రకటించిందో లేదు.. అలా టంప్ మళ్లీ తన వాచాలతను ప్రధర్శించారు.

ఇరాన్ జలసంధిని ఓపెన్ చేసినందుకు ఆ దేశానికి థ్యాంక్స్ చెబుతూనే.. తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్ లో  హర్మూజ్ పై అమెరికా నౌకా దిగ్బంధనం కొనసాగుతుందని పేర్కొనడం ద్వారా ఇరన్ ను రెచ్చగొట్టారు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లైంది.  ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా మారుతుందన్న అనుమానాలు, ఆందోళన ప్రపంచ దేశాలలో వ్యక్తమౌతోంది.   మిత్రదేశాల నుంచి అందుతున్న హెచ్చరికలను, ప్రపంచ దేశాల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని అమెరికా వెనక్కి తగ్గితేనే పశ్చిమాసియాలో శాంతి సాధ్యమవుతుంది.