ట్రంప్ గురి ఇప్పుడు క్యూబాపై?
Published on: Fri Jan 30, 2026 8:00AM

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆధిపత్య ధోరణికి అంతూ పొంతూ లేదన్నట్లుగా కనిపిస్తున్నది. మొత్తం ప్రపంచాన్ని తానే శాసించాలన్న అహంకారంతో ముందుకు సాగుతున్న అగ్రదేశాధినేత డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తన దృష్టిని క్యూబాపై సారించారు.
వెనిజువేలా అధ్యక్షుడిని ఆ దేశంలోనే, ఆయన నివాసంలోనే బంధించి, గ్రీన్ ల్యాండ్ ను అధీనం చేసుకుంటామని ప్రకటించిన డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు క్యూబాను టార్గెట్ చేశారు. క్యూబాలో ఏడు దశాబ్దాలుగా సాగుతున్న కమ్యూనిస్టు పాలనను అంతం చేసి తన అధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నాలు ఆరంభించారు. ఈ క్రమంలో క్యూబాను అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా ప్రకటించారు. వెనిజువేలాలో మదురోను బంధించడానికి అనుసరించిన విధానాన్నే క్యూబాలోనూ అమలు చేయాలని భావిస్తున్నారు. అమెరికాతో ఒప్పందానికి ముందుకు రాకుంటే క్యూబా భారీ ముల్యం చెల్లించుకోవలసి ఉంటుందంటూ హెచ్చరిక జారీ చేశారు.
క్యూబాకు అతి పెద్ద ఆర్థిక అండ అయిన వెనిజువేలాలో ప్రభుత్వ మార్పిడితో క్యూబాకు అక్కడ నుంచి చమురు సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆ దేశం ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. నిత్యావసరాలు, ఔషధాల కొరతతో సతమతమౌతోంది. ఈ పరిస్థితిని మరింత తీవ్రం చేయడానికా అన్నట్లుగా క్యూబా నుంచి ఎగుమతి అయ్యే మెడికల్ మిషన్ లపై ఆంక్షలు విధించే దిశగా అమెరికా పావులు కదుపుతోందనీ, ఈ ఆంక్షల కారఏణంగా క్యబాకు విదేశీ కరెన్సీ అందకుండా అడ్డుకోవడమే అమెరికా వ్యూహమని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.


