ట్రంప్ నేర్పుతున్న పాఠాలు

 

అనుకోనిది నిజమైంది. అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ఇవాళ పదవిని చేపట్టనున్నారు. ట్రంప్ గొప్ప మనిషి అన్న అభిప్రాయం ఎవరిలోనూ లేదు. వినయశీలి, నిరాడంబరుడు, నిజాయితీపరుడు, సంస్కారి లాంటి ఉపమానాలు ఆయనకు ప్రయోగించాలంటే కాస్త ఆలోచించాల్సిందే! అలాంటి ట్రంపు ఏకంగా అమెరికా అత్యున్నత పీఠాన్ని ఎలా అధిరోహించాడూ అంటే దానికి చాలా కారణాలే కనిపిస్తాయి. వాటిలో మనకి ఉపయోగపడేవి కొన్ని...

 

లక్ష్యం

 

ట్రంప్ ఒక వ్యాపారవేత్తగా ప్రపంచానికి పరిచయమే! కానీ దేశంలో ఏదో ఒక ఉన్నత పదవిని చేపట్టాలన్న కోరిక ఆయనలో ఎప్పటినుంచో ఉండేది. 1988లోనే ట్రంప్ ప్రెసిడెంట్ పదవి కోసం ప్రయత్నించాడన్న విషయం చాలామందికి తెలియదు. అలా అవకాశం కోసం ఎదురుచూస్తున్న ట్రంప్కి 2016లో పరిస్థితులు అనుకూలంగా కనిపించాయి. తరలిపోతున్న ఉద్యోగాలు, పెరిగిపోతున్న అప్పులు, తీవ్రవాదం వంటి నేపథ్యంలో అమెరికా ప్రజలలో పెరిగిపోతున్న నిస్తేజాన్ని ఓట్ల రూపంలోకి మార్చుకునేందుకు ట్రంప్ ముందుకు ఉరికాడు.

 

పక్కా ప్రణాళిక

 

ఎప్పుడైతే అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచాడో, ఆ క్షణం నుంచే ట్రంప్ తనకి ఓ అరుదైన అవకాశం వచ్చిందని భావించాడు. ఆ అవకాశాన్ని అతను వదులుకోదల్చుకోలేదు. తనని వెన్నంటి గెలిపించేందుకు ప్రతిభావంతులతో కూడుకున్న ఓ జట్టుని ఏర్పాటు చేసుకున్నాడు. ‘MAKE AMERICA GREAT AGAIN’ అనే నినాదంతో ఉధృతరూపంలో ప్రచారాన్ని మొదలుపెట్టాడు.

 

వెనకడుగు వేయలేదు

 

వాచాలుడు, ఆడంబరుడు, అహంకారి అయిన ట్రంప్ ఎన్నికలలో నిలబడ్డాడు అని తెలియగానే అంతా పెదవి విరిచారు. అతని ప్రత్యర్థి హిల్లరీ గెలుపు నల్లేరు మీద బండినడకగా సాగిపోతుందని భావించారు. ఆఖరికి ట్రంప్ ప్రైమరీలలో తన తోటి రిపబ్లికన్ అభ్యర్థుల ముందు కూడా నిలవలేడని ఊహించారు. కానీ ట్రంప్ ఏ క్షణంలో కూడా వెనకడుగు వేయలేదు. సర్వే ఫలితాలు ఎలా ఉన్నా తన పంథాలో తాను దూసుకుపోయాడు. కొన్ని సంస్థలు ట్రంప్ ఓడిపోతాడని ముందుగానే పందెం డబ్బులని చెల్లించేశాయంటే పరిస్థితి తనకి ఎంత ప్రతికూలంగా ఉందో అర్థమవుతుంది. కానీ ఏ దశలోనూ ట్రంప్ తన దూకుడిని తగ్గించకపోవడంతో విజయం అతని పరమైంది.

 

వ్యూహ ప్రతివ్యూహాలు

 

ప్రత్యర్థి మీద ఎలా దాడి చేయాలో ట్రంప్కు వెన్నతో పెట్టిన విద్య. అందుకే హిల్లరీ భర్త బిల్ క్లింటన్ రాసలీలల గురించీ, హిల్లరీ ఈమెయిల్స్ స్కామ్ గురించీ, ఆమె అనారోగ్యం గురించీ పదే పదే ప్రస్తావించేవాడు. వ్యక్తిగత స్థాయిలో ఇవి చవకబారు ఎత్తుగడలాగా కనిపించినా అధ్యక్ష స్థానంలో ఉండే మనిషి ఎలాంటి మచ్చా లేకుండా దృఢమైన ఆరోగ్యంతో ఉండాలని ప్రజలు కోరుకోవడం సహజం. అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ శైలిని గమనిస్తే ఇలాంటి ప్రతివ్యూహాలు చాలానే కనిపిస్తాయి.

 

ప్రయత్నిస్తే గెలుపు సాధ్యమే

 

చొరవగా ప్రయత్నించాలే కానీ ఎవరికైనా గెలుపు సాధ్యమే అని ట్రంప్ విజయం నిరూపిస్తోంది. ట్రంప్ తన గెలుపుకి దోహదపడుతుందనుకున్న ఏ అవకాశాన్నీ జారవిడుచుకోలేదు. ఆఖరికి ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలలో కూడా తన దూకుడుని చూపించాడు. ఉద్యోగాలను రప్పిస్తాను, దేశం సరిహద్దులలో గోడ కడతాను, ముస్లింలను పరీక్షిస్తాను వంటి మాటలు మాట్లాడినా వాటికి కట్టుబడి ఉన్నాడు. ఓటర్లలో కొందరు తన మాటను వింటారని ట్రంప్కు తెలుసు. నిజంగానే ఓటర్లు అతని మాటని విన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో అలాంటి మొండివాడ తమకు నాయకునిగా ఉండాలని నిశ్చయించుకున్నారు.

 

అధ్యక్ష పదవికి చేరుకునేందుకు ట్రంప్ తన వంతు ప్రయత్నంలో ఏ లోపమూ చేయలేదు. దాంతో పరిస్థితులు కూడా అతనికి కలిసి వచ్చాయి. కీలక సమయంలో హిల్లరీకి సంబంధించిన ఈమెయిల్స్ కుంభకోణం బయటపడటంతో అతన్ని విజయం వరించింది. అంతా అది అతని అదృష్టం అనుకున్నారు. కానీ అది అతని ప్రయత్నానికి ఓ చిన్న జోడింపు మాత్రమే!

- నిర్జర.