ఫైజర్ వ్యాక్సిన్ సిద్ధమైనా వాళ్లు చెప్పలేదు! ట్రంప్ ఆరోపణ
Published on: Tue Nov 10, 2020 11:50AM
తాము తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ 90 శాతం సమర్థవంతంగా పనిచేస్తోందని ఫైజర్ సంస్థ చేసిన ప్రకటనపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాక్సిన్ ఎప్పుడో సిద్ధమైనా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులతో కుమ్మక్కై ఫైజర్ వ్యాక్సిన్ ఫలితాలను ప్రకటించలేదని ఆరోపించారు. కరోనాపై విజయం సాధించే దిశగా వ్యాక్సిన్ తయారైందని ఎన్నికలకు ముందే ప్రకటించడాన్ని డెమొక్రాట్లు ఇష్టపడలేదంటూ ట్రంప్ సంచలన ట్వీట్ చేశారు. వ్యాక్సిన్ విషయంపై అధికారిక ప్రకటనను ఫైజర్ సంస్థ కావాలనే ఆలస్యం చేసిందని ఆరోపించారు ట్రంప్.
ఫైజర్, ఇతర సంస్థలు ఎన్నికలకు ముందు వ్యాక్సిన్ గురించిన సమాచారాన్ని బహిర్గతం చేయాలని భావించలేదన్నారు ట్రంప్. ముందే ఈ పని చేసే ధైర్యం వారికి లేకపోయిందన్నారు. యూఎస్ ఎఫ్డీయే సైతం రాజకీయ ప్రయోజనాలనే చూసిందని ట్రంప్ విమర్శించారు. కరోనాపై పోరాటం ఇంకా ముగియలేదని, మరిన్ని నెలల పాటు ప్రజలు వైరస్ ను ఎదుర్కొనేలా తమవంతు జాగ్రత్తలు తీసుకోవాల్సి వుందన్నారు ట్రంప్, వ్యాక్సిన్ తయారీిలో పాలు పంచుకున్న శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. ఫైజర్ నుంచి వచ్చిన ప్రకటన జాతికి కొత్త ఊపిరిని ఇచ్చిందని అన్నారు.


