అధికార పార్టీకి అభ్యర్థులు కరువు? పట్టభద్రులతో పరేషాన్!

ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి. ఈ సామెత వ్యాపారంలోనే కాదు రాజకీయాల్లోనూ సూటవుతోంది. ఇప్పటివరకు ఆ పార్టీ టికెట్ కోసం ఆశావహులు క్యూ కట్టేవారు. ఎలాగైనా టికెట్ ఇప్పించాలని ముఖ్య నేతల చుట్టూ ప్రదిక్షణలు చేసేవారు. కాని ఇప్పుడు సీన్ మారిపోయింది. టికెట్ ఇస్తామన్నా ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అధికార పార్టీగా ఉన్నా నేతలెవరు అటువైపు చూడటం లేదు. పోటీ చేయాలని హైకమాండ్ సూచిస్తున్నా.. తమ వల్ల కాదంటూ దండం పెట్టి పోతున్నారట లీడర్లు. ఈ పరిస్థితి తలెత్తింది తెలంగాణలో రూలింగ్ లో ఉన్న టీఆర్ఎస్ పార్టీలో. కేసీఆర్,కేటీఆర్ చెబుతున్నా.. పోటీ చేయడానికి నేతలెవరు ఆసక్తి చూపడం లేదని ప్రచారం జరుగుతోంది. 
  

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి  పట్టభధ్రుల ఎమ్మెల్సీ  ఎన్నికలు సవాల్ గా  మారుతున్నాయి. 2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ విజయం సాధించిన కారు పార్టీకి .. రెండుసంవత్సరాలు కూడా  కాకుండానే రివర్స్ సీన్ కనిపిస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అధికార పార్టీకి అభ్యర్థులే కరువైన పరిస్థితి నెలకొంది.  ఓటమి భయంతోనే పోటీకి  నేతలెవరు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. సిట్టింగులు తమ వల్ల కాదని చెతులెత్తేస్తుండగా.. కొత్త వారు పోటీకి వెనుకంజ వేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్న నిరుద్యోగులు,ఉద్యోగులు, టీచర్స్ లో కేసీఆర్ సర్కార్ పని తీరుపై  తీవ్ర వ్యతిరేకత ఉందన్న కారణంగానే  ఎన్నికల్లో పోటీకి ఎవరూ ఆసక్తి చూపడం లేదని భావిస్తున్నారు. 

 

వచ్చే ఏడాది మార్చిలో వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్‌‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్స్‌‌ ఎమ్మెల్సీ రామచంద్రరావు ల పదవీకాలం కాలం ముగుస్తుంది. ఆ లోపే ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మండలి ఎన్నికలపై ఫోకస్ చేసిన ప్రధాన పార్టీలు ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టాయి. అయితే అధికార టీఆర్ఎస్ నేతలు మాత్రం దాన్ని పట్టించుకోలేదు. దీంతో రంగంలోకి దిగిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ మంత్రి కేటీఆర్.. ఎన్నికల జరగనున్న ఆరు జిల్లాల నేతలతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఓటరు నమోదు చేపట్టాలని పార్టీ ప్రజా ప్రతినిధులను ఆదేశిస్తున్నారు.  అయితే ఓటర్ నమోదు కోసం కార్యకర్తలతో మీటింగ్ పెట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫీడ్ బ్యాక్ చూసి ఆందోళన చెందుతున్నారట. నిరుద్యోగులు,ఉద్యోగులు, టీచర్స్ లో పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని కార్యకర్తలు స్పష్టంగా పెద్ద లీడర్లకు చెబుతున్నారట. ఓటర్ల నమోదు కార్యక్రమం చేపట్టిన పార్టీకి ప్రయోజనం ఏమీ ఉండదని స్పష్టం చేస్తున్నారట. ఇదే విషయాన్ని టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కేటీఆర్ కు చెప్పినట్లు చెబుతున్నారు. 

 

గ్రాడ్యుయేట్స్‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం కష్టమేనని టీఆర్ఎస్ లీడర్లల్లనే చర్చ జరుగుతోంది. ఉద్యమ టైమ్ లో ఉన్న పరిస్థితులకు ఇప్పటికీ చాలా మార్పు వచ్చిందని చెబుతున్నారు. అందుకే గ్రాడ్యుయేట్స్‌‌ ఎలక్షన్స్ లో పోటీ చేసేందుకే అభ్యర్థులు భయపడుతున్నట్లు టీఆర్ఎస్ ఇంటర్నల్ మీటింగ్స్ లో చర్చ నడుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మళ్లీ పోటీ చేసేందుకు సిద్దంగా లేరని తెలుస్తోంది. పోటీ చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో ఆయనకు తెలుసు కాబట్టే ఆయన వెనుకంజ వేశారనే చర్చ పార్టీలో జరుగుతోంది. పోటీ చేయబోనని పల్లానే స్వయంగా పార్టీ పెద్దలకు చెప్పినట్లు చెబుతున్నారు.  మండలి ఏర్పాటు తర్వాత ఇప్పటి వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం నుంచి టీఆర్ఎస్ గెలవలేదు. ఈ నియోజకవర్గం నుంచి  హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ను పోటీకి దింపాలని పార్టీ భావిస్తోంది. అయితే ఆయన కూడా పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదని సమాచారం.

 

2018 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచినప్పటికీ ఆ వెంటనే జరిగిన కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఓడిపోయారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన జీవన్ రెడ్డికి అధికార పార్టీ అభ్యర్థి కనీస పోటీ కూడా ఇవ్వలేదు. 2015 లో  జరిగిన వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్‌‌ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి అతి కష్టం మీద గెలిచారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నుంచి పోటీచేసిన దేవిప్రసాద్ ఘోరంగా ఓడిపోయారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, టీచర్ల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని టీఆర్ఎస్ లీడర్లే చెబుతున్నారు. ప్రస్తుతం ఆ వ్యతిరేకతను తట్టుకొని గెలవటం సాధ్యం కాదని ఓపెన్ గానే మాట్లాడుకుంటున్నారు.

 

మొత్తానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అధికార పార్టీకి అభ్యుర్థులే దొరకపోవడం ఆశ్చర్యకరంగా మారింది. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేననే విషయం దీంతో బయటపడుతుందనే చర్చ జరుగుతోంది. శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో తమకు ఎదురవుతున్న ఇబ్బందికర పరిస్థితిని టీఆర్ఎస్ ఎలా అధిగమిస్తుందో చూడాలి మరీ.