లాజిక్ గా చూస్తే టీఆర్ఎస్ కు వచ్చేది 12 సీట్లే!!

 

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీఆర్ఎస్ కు పన్నెండు సీట్లే వస్తాయని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. అంత నమ్మకంగా ఎలా చెబుతున్నారంటే దానికి ఆయన ఏపీ వైపు చూపిస్తున్నారు. ఏపీలో వైఎస్ జగన్ చెప్పిన లాజిక్‌ తెలంగాణలో కూడా వర్కౌట్ అవుతుంది అంటున్నారు. 

ఇంతకీ ఆ లాజిక్ ఏంటంటే.. ఏపీలో టీడీపీ కేవలం 23 అసెంబ్లీ సీట్లు గెలుచుకొని ఘోరపరాజయం పాలైంది. ఈ పరాజయానికి జగన్ అదిరిపోయే లాజిక్ చెప్పారు. 2014 ఎన్నికలు తరువాత వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ చేశారు. 2019 ఫలితాల్లో.. ఆ 23 సంఖ్య మాత్రమే టీడీపీకి మిగిలింది. ఇది జగన్ కి బాగా నచ్చింది. తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని.. అందుకే టీడీపీకి 23 సీట్లు మాత్రమే వచ్చాయని, దేవుడు గొప్ప స్క్రిప్ట్ రాశాడని.. ఎక్కడ సందర్భం వచ్చినా చెబుతున్నారు. 

ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇలాంటి లాజిక్కే చెబుతున్నారు. ఏపీలో టీడీపీకి జరిగినట్లుగా తెలంగాణలో టీఆర్ఎస్‌కు జరుగుతుందని అంటున్నారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్న టీఆర్ఎస్‌కు వచ్చే ఎన్నికల్లో ఆ 12 సంఖ్యనే మిగులుతుందని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 97 లక్షల మంది టీఆర్ఎస్‌కు ఓటు వేస్తే.. లోక్‌సభ ఎన్నికలకు వచ్చే సరికి 77 లక్షలకు పడిపోయారని.. తిరుగుబాటుకు ఇదే సంకేతమని రేవంత్ అన్నారు. మరి రేవంత్ ఆశ నెరవేరుతుందో లేదో చూడాలి.