స్వీయ సర్వేతో టీఆర్ ఎస్‌కు తంటాలు!
Published on: Sat Jul 30, 2022 10:40PM
నువ్వెంత బలవంతుడివో తెలుసుకోవాలంటే ముందుగా నీ శతృవు ఎవరో తెలియాలి.. అనేది ఓ సామెత. అవును రాజుగారి సత్తా తెలిసేది సామంతులు చెప్పక్కర్లేదు, ఆయన్ను ఎదిరించగల పక్క దేశం వారిని కదిలిస్తే చెబుతారు. ఇప్పటి రాజకీయ నాయకులు, పార్టీలకు మాత్రం సర్వే చేయించుకునే సత్తా ఒకటి వచ్చేసింది. రాష్ట్రంలో, దేశంలో తమ సత్తాను తామే తెలుసుకో గల్గుతున్నారు. ఎవరికి వారికి సర్వే బృందాలను జనంలోకి పంపించి కాయితాలు నింపించి మరీ తెలుసుకుంటున్నారు మనం, మనవాడు ఏపాటి గట్టివాడనే సంగతి. అసలీమధ్య కాలంలో సర్వేలకే మంచి డిమాండ్ ఉంది. పీకే అనే వ్యక్తి తన టీమ్‌తో కలిసి దేశమంతా ఎవరికి కావలసివస్తే వారికి సర్వే చేసేస్తుండడంతో దీని మీద అన్ని పార్టీలకూ ఆసక్తి రెండింతల యింది. ఆ మధ్య హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో తెలంగాణాలో ఆ టీమ్ శరవేగంతో పనిచేసింది. అంతకంటే ముందే టీఆర్ ఎస్ పని తీరు మీద గ్రౌండ్ రిపోర్టు ఒకటి తయారు చేయడం జరిగింది. అన్నట్టు ఇపుడు టీఆర్ ఎస్‌కు కొత్తగా ఐ పాక్ అనేదానితో ఒప్పందం అయింది. ఆ సంస్థ ఇచ్చిన నివేదికల ప్రకారం వచ్చే ఎన్నికల్లో టీఆర్ ఎస్‌కు విజయావకాశాలు అంతగా లేవు.
ఎప్పుడూ విజయాన్నే ఆకాంక్షించే కేసీఆర్, కేటీఆర్‌కి ఈ నివేదిక మింగుడుపడటం లేదు. నాయకుడిని మెప్పించడానికి మంత్రులే స్వయంగా సర్వేలు చేపట్టడం ఆరంభమయింది. అంటే ఎవరి జిల్లాలో వారు. అప్పుడు చాలా క్లియర్‌కట్ రిపోర్టు వస్తుందన్నది టీఆర్ ఎస్ ఆశ. ఉదాహరణకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాలపై మంత్రి ఎరబెల్లి దయాకర్ సర్వేలు చేయిస్తే స్టేషన్‌ఘనపూర్, పరకాల, మహబూబాబాద్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు తేలిందట!
కాగా, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో ఆలేరు, తుంగతుర్తి, భువనగిరి ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్లు రిపోర్టులు తేల్చాయట. అటు ఖమ్మంలోని పదింట ఆరుచోట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని తేలింది. రంగారెడ్డి జిల్లాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సైతం సర్వే చేయించారట. ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కుత్భూల్లాపూర్, మేడ్చల్, ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్లలో సానుకూలత లేదని తేలిందట. ఇక ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పరిస్థితి కాస్త విచిత్రంగా ఉంటుందట. వనపర్తి, నారాయణపేట్, మహ బూబ్‌నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి రెండోసారి గెలిచిన పరిస్థితి లేదని తేలింది. మొత్తానికి దేవర వారిని మెప్పించడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు చేయించుకున్న స్వీయ సర్వేలు అసలు వారి పరిస్థితే అయోమ యంగా ఉందన్న సంతి వారికే స్పష్టమయి దిగులుతో ఊరకున్నట్టు విశ్లేషకుల మాట. అసలు సర్వే అనేది ప్రజల మనసును ఉన్నది ఉన్నట్టు చెప్పేవి. అంతేకాని నేతల మనసులో, సీఎంగారికి ఏం కావాలో చెప్పేవి సర్వేలు ఎందుక వుతాయి. అంచేత కేసీఆర్ అండ్ టీమ్ కి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల పట్ల సంపూర్ణ అవగాహన వచ్చి ఉంటుం దని విశ్లేషకులు అంటున్నారు.


