గోరటి కాదు దేశపతే! నాగేశ్వర్ కు సపోర్ట్? రూటు మారిన కారు 

తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై సస్పెన్స్ కొనసాగుతోంది. టీఆర్ఎస్ ఆశావహులంతా పార్టీ అధినాయకత్వానికి తమ విన్నపాలను అందిస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ ఈసారి పక్కా పొలిటికల్ రూట్ లో వెళ్లకుండా... ట్రాక్ మార్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమకారులకే అవకాశం ఇవ్వాలని గులాబీ బాస్ డిసైడ్ అయినట్టు సమాచారం. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో ముందున్న ప్రజాగాయకుడు, ప్రస్తుతం సీఎం ఓఎస్డీగా ఉన్న దేశపతి శ్రీనివాస్ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. కళాకారుడి కోటాలో ఈయనకు సీఎం కేసీఆర్ ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీకి ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న పేరు కూడా వినిపించింది. ఇటీవలే గోరటి.. సీఎం కేసీఆర్‌ను కూడా కలువడంతో ఆయనకు సీటు ఖాయమైనట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా పేర్లు మారిపోయి దేశపతికే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. 


తెలంగాణలో గవర్నర్‌ కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. సభావత్‌ రాములునాయక్‌ సీటు మార్చి 2న ఖాళీ కాగా, నాయిని నర్సింహారెడ్డి జూన్‌ 19న, కర్నె ప్రభాకర్‌ ఆగస్టు 17న ఖాళీ అయింది. మూడు సీట్లను భర్తీ చేస్తారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కాని ఆశావహులు ఎక్కువగా ఉండటంతో  కసరత్తు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మండలిలో ప్రభుత్వ విప్ గా పని చేసిన కర్నె ప్రభాకర్‌కు ఎక్స్ టెన్షన్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. సీనియర్‌ నేత నాయిని నర్సింహరెడ్డికి కూడా మళ్లీ ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. మూడో స్థానం కోసం మాజీ ఎంపీ సీతారాంనాయక్‌, కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌ , మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పేర్లు ఎక్కువగా వినిపించాయి. పీవీ కూతురు వాణికి కూడా ఇవ్వొచ్చని ప్రచారం జరిగింది. అయితే దేశపతికే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సీటు ఖరారైందని తెలుస్తోంది. 

            
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలపైనా కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు టీఆర్ఎస్ వర్గాల సమాచారం. హైద్రాబాద్- రంగారెడ్డి-  మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి  ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. అయితే  నాగేశ్వర్ కు పోటీగా టీఆర్ఎస్ నుంచి పోటీకి నిలబెట్టకుండా, ఆయనకు మద్దతివ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. హైద్రాబాద్ సీటుకు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ను బరిలోకి దింపాలని కేటీఆర్ ప్లాన్ చేసినట్లు ఇటీవల ప్రచారం జరిగింది. అయితే బొంతు కాకుండా ప్రొఫెసర్ నాగేశ్వర్ కు సపోర్ట్ చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. నల్గొండ-వరంగల్- ఖమ్మం గ్రాడ్యుయేట్ స్థానం నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డిని పోటీకి దించే  అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రి మల్లారెడ్డి అల్లుడైన మర్రి రాజశేఖర్ రెడ్డి.. గత లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి లోక్ సభ సీటులో  రేవంత్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. 


మరోవైపు అధికార పార్టీగా ఉండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు ఇవ్వడంపై పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ నుంచి అధికారికంగా అభ్యర్థి పోటీ చేయకుంటే.. ఓడిపోతారనే భయంతోనే వెనక్కి తగ్గారని విపక్షాలు ప్రచారం చేసే అవకాశం ఉందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఉద్యమకారుడికే సపోర్ట్ చేస్తున్నందున పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చని మరికొందరు చెబుతున్నారు. టీజేఎస్ చైర్మెన్ కోదండరామ్ పోటీ చేయబోతున్నవరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మర్రి రాజశేఖర్ రెడ్డి గట్టి పోటీ ఇవ్వకపోవచ్చని ఆ మూడు జిల్లాల నేతలు అధిష్టానానికి చెబుతున్నారట.