TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సిగ్గు సిగ్గు... ధర్నా చౌక్ విలువ ఇప్పుడు తెలిసొచ్చిందా! 

Published on: Fri Nov 12, 2021 4:49PM

తెలంగాణ రాజకీయాల్లో సీన్ రివర్స్ అవుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి వద్దన్నదే ముద్దవుతోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక ఇచ్చిన షాక్ తో గులాబీ పార్టీ స్టాండ్ పూర్తిగా మారిపోయింది. గతంలో నిషేధించిన ఇందిరా పార్క్ ధర్నాచౌక్‌లోనే టీఆర్‌ఎస్‌ ధర్నా చేసింది. కేంద్రం ధాన్యం కొనాలంటూ ఆందోళన నిర్వహించింది.

ధర్నా చౌక్‌ అంటేనే ఎక్కడ లేని ఏవగింపును ప్రదర్శించిన టీఆర్‌ఎస్‌ పార్టీ… ఇప్పుడు అక్కడే ధర్నాకు దిగడం  పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వద్దన్న వేదిక వద్ద వారే ధర్నా చేయడమేంటన్న విమర్శలు వస్తున్నాయి.  టీఆర్‌ఎస్ కు ఒక విధానం, పద్ధతి అంటూ లేవని విమర్శిస్తున్నారు. ధర్నా చౌక్‌ను ఎత్తేసిన టీఆర్ఎస్.. అక్కడే ధర్నా చేయడానికి సిగ్గుండాలని పరిరక్షణ సమితి నాయకులు విమర్శించారు. టీఆర్ఎస్ పతనానికి నిదర్శనమని కోదండరామ్ మండిపడ్డారు. ధర్నా చౌక్ వల్ల ప్రజలకు ఇబ్బందులని చెప్పి ఎత్తేశారని.. ఇప్పుడు టీఆర్ఎస్ ధర్నా చేస్తే ప్రజలకు ఇబ్బంది కలగలేదా అని ప్రశ్నించారు .టీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఎవరూ ధర్నా చేయాల్సిన అవసరం ఉండదని కేసీఆర్ అన్నారని, ఇప్పుడు ఆ పార్టే ధర్నా చేసిందని ఎద్దేవా చేశారు.  టీఆర్ఎస్ పార్టీకి ఇది అంతమని కోదండరామ్ అన్నారు. 

ఇందిరా పార్క్‌ వద్ద ఉన్న ధర్నాచౌక్‌.. రాష్ట్ర రాజధానిలో ధర్నాలు, బైఠాయింపులు, సభలు, సమావేశాలు, ఆందోళనలు, నిరసన దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలకు వేదిక. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ మాదిరిగా ప్రజా గొంతుకలను వినిపించే సభాస్థలి. ప్రజా సంఘమైనా, కుల, మత, కార్మిక, కర్షక, విద్యార్థి, మహిళా, ఉద్యోగ సంఘమేదైనా.. తమ డిమాండ్ల సాధనకు ఈ ధర్నా చౌక్‌నే వేదికగా చేసుకునేవి. ఇలాంటి ప్రజా వేదికను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిషేధించింది.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే 2016లో ధర్నా చౌక్‌ను ఎత్తేసింది. అక్కడ దర్నాలు, ఆందోళనలు, ర్యాలీలు, బైఠాయింపులు, సభలు, సమావేశాలను నిషేధించింది.  చౌక్‌ను నగరం వెలుపలకు తరలిస్తామని తెలిపింది. దాంతో ప్రజలు, ప్రజా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళనలు, ర్యాలీలు, నిరసనలు చేపట్టాయి. 2017 మే నెలలో ‘సేవ్‌ ధర్నా చౌక్‌’ పేరుతో నాటి టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ఆధ్వర్యంలో ప్రతిపక్షాలు ఇందిరా పార్కు వరకు ర్యాలీ నిర్వహించాయి. ఇది కాస్తా హింసాత్మకంగా మారింది. పోలీసులు అడ్డుకోవడంతో నలుగురు ఆందోళనకారులు గాయపడి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. 

ధర్నా చౌక్‌ను పునరుద్ధరించాలంటూ ఓవైపు ఆందోళనలు కొనసాగుతుండగానే… ఉస్మానియా విశ్వవిద్యాలయ రిటైర్డు ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వరరావు హైకోర్టుకు లేఖ రాశారు. దీనిని కోర్టు సుమోటోగా స్వీకరించింది. సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావు కూడా ధర్నా చౌక్‌పై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిని విచారించిన హైకోర్టు… 2018 నవంబరు 13న ధర్నా చౌక్‌పై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.