TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

వామ్మో.. టీఆర్ఎస్ ఆస్తులు ఎంతో తెలుసా? 

Published on: Tue Jun 22, 2021 4:12PM

తెలంగాణ రాష్ట్ర సమితి.. 2001లో ఉద్యమ పార్టీగా పురుడుపోసుకుంది. ప్రస్తుతం అధికార పార్టీగా... తిరుగులేని రాజకీయ శక్తిగా మారింది. తెలంగాణలో రెండోసారి అధికారం చేపట్టిన టీఆర్ఎస్ .. తన ఆస్తులను భారీగా పెంచుకుంది. ఎన్నికల కమిషన్  కు టీఆర్ఎస్ సమర్పించిన ఆస్తుల లెక్క చూస్తే షాక్ అవాల్సిందే..  టీఆర్ఎస్ కు ప్రస్తుతం ఉన్న మొత్తం ఆస్తుల విలువ సుమారు 301.47 కోట్ల రూపాయలు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన నివేదికలో ఆ పార్టీ తమ ఆస్తుల విలువను చెప్పింది. 2018–19లో రూ.188.73 కోట్లుగా ఉన్న టీఆర్‌ఎస్‌ నిధులు, ఆస్తుల విలువ ఏడాది కాలంలో రూ.301.47 కోట్లకు చేరింది. 

తమ పార్టీ ఆదాయ, వ్యయాలకు సంబంధించిన 2019–20 ఆడిట్‌ నివేదికను గత ఫిబ్రవరి 15న టీఆర్‌ఎస్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల ఆదాయ వ్యయాలకు సంబంధించిన వార్షిక నివేదికను సీఈసీ ఇటీవల తన వెబ్‌సైట్‌ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుత ఆస్తిలో జనరల్‌ ఫండ్‌ రూపంలో 292.30 కోట్లు, కార్పస్‌ ఫండ్‌ రూపంలో రూ.4.76 కోట్లు, ఇతర రూపంలో రూ.4.41 కోట్లు ఉన్నట్లు ఎన్నికల సంఘానికి తెలిపింది టీఆర్ఎస్.  పార్టీ పేరిట ఉన్న భవనాలు, వస్తు సామగ్రి విలువ రూ.21.27 కోట్లుగా ఉంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న జిల్లా కార్యాలయాల స్థలం, భూముల విలువ సుమారు రూ.16.50 కోట్లుగా ఉంటుందని లెక్కలు వేసింది గులాబీ పార్టీ. 2019–20లో స్థిరాస్తుల కొనుగోలు, షెడ్యూలు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, సేవింగ్స్‌ ఖాతాలపై వడ్డీ తదితరాల రూపంలో రూ.101 కోట్లు సమకూరాయని  లెక్కలు చెప్పింది.

2019–20 ఆర్ధిక సంవత్సరంలో టీఆర్‌ఎస్‌కు వి విధ మార్గాల్లో 130.46 కోట్లు సమకూరితే.. అందులో విరాళాల రూపంలో అత్యధికంగా 89.55 కోట్లు అందాయి. పార్టీ సభ్యత్వ నమోదు, పార్లమెంటరీ, లెజిస్లేటివ్‌ పార్టీ, టీఆర్‌ఎస్‌వీ విభాగాల నుంచి కలుపుకుని 22.79 కోట్లు, బ్యాంకుల్లో సెక్యూరిటీ డిపాజిట్లు, సేవింగ్‌ ఖాతా లపై వడ్డీ తదితరాల రూపంలో మరో రూ.18.10 కోట్లు సమకూరాయి. విరాళాల్లో ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో రూ.89.15 కోట్లు, వ్యక్తిగత దాతల నుంచి రూ.37.42 లక్షలు వచ్చాయని ఆ పార్టీ ప్రకటిచింది. ప్రకటనల కు 2.69 కోట్లు, ప్రచారానికి రూ.4.94 కోట్లు కలుపుకుని మొత్తంగా ఎన్నికల కోసం 7.64 కోట్లు ఖర్చు చేసినట్టు అఫిడవిట్ లో పేర్కొంది. పార్టీ కార్యా లయాల్లో ఉద్యోగుల వేతనాలు, ఇతర ఖర్చులు కలుపుకుని ఏడాది కాలంలో 21.18 కోట్లు పార్టీ అవసరాల కోసం ఖర్చు చేసినట్టు తన నివేదికలో తెలంగాణ రాష్ట్ర సమితి వెల్లడించింది. 

ఏడాదిలోనే టీఆర్ఎస్ ఇంత ఆదాయం పెరగడంతో ఇతర రాజకీయ పార్టీలు షాకవుతున్నాయి. అయితే ఇది కేవలం అధికారిక లెక్కలు మాత్రమే.. అనధికారికంగా ఇంకా ఎంత ఆస్థి ఉంది అన్నది కూడా చర్చగా మారింది.