పీఎం మోదీపై ప్రివిలేజ్ నోటీస్.. పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీల ధూంధాం..
Published on: Thu Feb 10, 2022 10:01AM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తీరుపై ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై విరుచుకుపడుతూ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. మోదీ తెలంగాణ వ్యతిరేకి అంటూ టీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు చేశారు. ఆ సెగ ఇప్పుడు పార్లమెంట్‌నూ తాకింది.
రాజ్యసభలో ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు కారు పార్టీ ఎంపీలు కె.కేశవరావు, సంతోష్‌కుమార్, సురేశ్‌రెడ్డి, లింగయ్య యాదవ్‌లు నోటీసు అందజేశారు. ప్రధాని అభ్యంతరకరంగా మాట్లాడారని.. 187వ నిబంధన కింద నోటీసు ఇస్తున్నట్టు ఎంపీలు తెలిపారు.
ఇటీవల రాజ్యసభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ మండిపడుతోంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విభజన అవమానకరంగా జరిగిందని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌తో సహా ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తెలంగాణ వ్యాప్తంగా మోదీ దిష్టిబొమ్మలు తగలబెట్టారు. బీజేపీ నేతలను అడ్డుకున్నారు. గురువారం ఇలా టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు ప్రధాని మోదీపై ప్రివిలేజ్ నోటీసు ఇవ్వడంతో మరింత రచ్చ రాజుకుంది.
అయితే, పార్లమెంట్ బడ్జెట్ తొలి విడత సమావేశాలు శుక్రవారం (ఫిబ్రవరి 11)తో ముగుస్తుండటంతో.. గురువారం మోదీపై ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చినా ఇప్పటికిప్పుడు దీనిపై చర్చ జరిగే అవకాశం ఉండదు. తిరిగి మార్చి 14న రెండవ విడత సమావేశాలు మొదలవుతాయి. అంతవరకు జరిగేది ఏమీ ఉండదు. నిజానికి ఆ తర్వాత కూడా, టీఆర్ఎస్ సభ్యులు ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసుతో బ్రహ్మాండం బద్దలయ్యేది ఉండదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ విషయం టీఆర్ఎస్ నాయకులకు తెలియదా అంటే తెలియక కాదు.. వరద ప్రవాహంలో కొట్టుకు పోయే వారికి గడ్డిపోచ కూడా వెయ్యి ఏనుగుల బలాని ఇస్తుంది.. ప్రస్తుతం టీఆర్ఎస్ పరిస్థితి కూడా ఇదే అంటున్నారు.
.webp)
.webp)


