మొన్న టీఆర్ఎస్ భేటీకి...నిన్న అమిత్ షాతో భేటీ...డీఎస్ మార్క్ రాజకీయం !

 

మొన్నటికి మొన్న టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ సమావేశానికి హాజరయి వారికి షాక్ ఇచ్చిన డీఎస్, ఇప్పుడు అమిత్ షాతో సుధీర్గ భేటీ జరిపి మళ్ళీ హాట్ టాపిక్ గా మారారు. నిజానికి డీఎస్ అనే ఒక ఎంపీ ఉన్నారని కూడా టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ కూడా మర్చిపోయి ఉండచ్చు, అలాంటిది ఆయన వారి సమావేశానికి వెళ్లి షాక్ ఇచ్చి అక్కడితో ఆగక, నిన్న ఢిల్లీలో అమిత్‌షాను కలిశారు. ఈ ఇద్దరు నేతలు అరగంటకుపైగా సమావేశమైనట్లు సమాచారం. 

అయితే తెలంగాణా మీద ఫోకస్ పెట్టిన షాతో ఈయన అంత సేపు భేటీ కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో డీఎస్ కుమారుడు అరవింద్, నిజామాబాద్ నుంచి కేసీఆర్ కుమార్తె కవితపై బీజేపీ టికెట్ పై పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో ఎటూ పార్టీకే దూరంగా ఉన్నాడు కాబట్టి తన కుమారుడికి డీఎస్ మద్దతిచ్చి తన పార్టీకి వ్యతిరేకంగా కొడుకును గెలిపించుకున్నాడు. 

నిజానికి డీ శ్రీనివాస్ పై, ఎన్నికలకు ముందే వేటు వేయాలని తన తండ్రి కేసీఆర్ ను కవిత కోరారు. కానీ కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, కానీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అవమానించారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీలోకి డీఎస్ వెళతారని అందరూ అనుకున్నారు. కానీ, పార్టీ మారకపోయినప్పటికీ, గులాబీ గూటికి దూరమయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీ గనుక రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మళ్లీ డీఎస్ కాంగ్రెస్‌లో చక్రం తిప్పుతారని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. 

డి.శ్రీనివాస్ అనుచరులుగా గుర్తింపు తెచ్చుకున్న టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చింది. అయితే అనుచరులను కాంగ్రెస్ పార్టీలోకి పంపిన డీఎస్ తాను మాత్రం అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరితే రాజ్యసభ సభ్యత్వానికి ఇబ్బంది అనే కారణంగా ఆయన ఎక్కడా కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు. 

అసెంబ్లీ ఎన్నికలకు ముందు విద్యార్థినిపై లైంగిక దాడి కేసు ఎదుర్కొన్న ఆయన కుమారుడు సంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పని చేశారు. అలాంటి సంజయ్ బుధవారం టీఆర్ఎస్ ఎంపీ కవితతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తాజాగా ఎంపీ కవితతో డీఎస్ తనయుడు సంజయ్ భేటీ వెనుక ఆంతర్యం ఏమిటనే దానిపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన టీఆర్ఎస్ లో మళ్ళీ యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారనే విశ్లేషణ కాస్త లాజిక్ ప్రకారం బాగానే ఉంది.

కానీ మళ్ళీ ఆయన షాతో భేటీ కావడం మళ్ళీ ఆయన రాజకీయ చతురత మీద అంచనాలు రేపుతోంది. ఈ భేటీతో ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం మొదలయ్యింది. తనను అకారణంగా పక్కన పెట్టిందన్న కారణంతో ఎన్నికలకు ముందు, తన అనుచరులను కాంగ్రెస్ పార్టీలోకి పంపించి టీఆర్ఎస్ ఓట్లు చీల్చడం, తన కుమారుడిని బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేయించడం, టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు వ్యతిరేకంగా అరవింద్ కు మద్దతునివ్వడం, ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరవడం, మళ్ళీ అమిత్ షాతో భేటీ కావడం ఇవన్నీ డీఎస్ కాంగ్రెస్ మార్క్ రాజకీయం అని అనుకుంటున్నారు.