బతుకమ్మ ఉత్సవాల కోసం నగలు తాకట్టుపెట్టిన కవిత!

 

తెలంగాణాలో రైతుల ఆత్మహత్యల గురించి అసెంబ్లీలో గట్టిగా నిలదీస్తున్న తెదేపాపై తెరాస ఎంపీ కవిత ఎదురుదాడి చేస్తూ తెదేపాను ఒక దొంగల పార్టీ అని ఎద్దేవా చేసారు. దానికి తెదేపా నేతలు ధీటుగానే జవాబిచ్చారు. ఆ సందర్భంగా తెలంగాణా ఉద్యమాల సమయంలో తెరాస నేతలు, తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కవిత తెలంగాణాలోని పారిశ్రామికవేత్తలు, విద్యా సంస్థల నుండి బలవంతపు వసూళ్ళకు పాల్పడిన సంగతిని తెదేపా నేతలు గుర్తు చేసారు. వారి విమర్శలపై ఆమె తిరిగి స్పందిస్తూ చెప్పిన జవాబు మాత్రం చాలా నవ్వు తెప్పిస్తుంది.

 

తెలంగాణా ఉద్యమ సమయంలో తన నగలను తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బుతో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించిన సందర్భాలు ఉన్నాయని ఆమె అన్నారు. వారి వాదనలలో ఎవరి మాటలు నిజమో అందరికీ తెలుసు. ఎన్నికల సమయంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు తన ఆస్తిపాస్తుల గురించి ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లే వారి ఆర్ధిక పరిస్థితి గురించి చాటి చెపుతాయి. ఇక మరో గొప్ప విషయం ఏమిటంటే ఆమె తన బతుకమ్మ ఉత్సవాలను లోక్ మాన్య బాల గంగాధర్ తిలక్ మొదలుపెట్టిన గణేష్ ఉత్సవాలతో పోల్చుకొన్నారు. ఆనాడు స్వాతంత్ర సమరం జరుగుతున్న సమయంలో దేశ ప్రజల మధ్య ఐఖ్యత కల్పించేందుకు, వారిలో జాతీయస్పూర్తిని రగిలించేందుకు తిలక్ ఆనాడు మహారాష్ట్రలో గణేష్ ఉత్సవాలను నిర్వహించడం మొదలుపెట్టారు. తను కూడా సరిగ్గా అదే ఉద్దేశ్యంతో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించడం మొదలుపెట్టానని కవిత చెప్పుకొన్నారు.

 

బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించడం కోసం ఆమె నగలు తాకట్టు పెట్టారో లేదో తెలియదు కానీ ఆ ఉత్సవాలను నిర్వహించడం ద్వారా తెలంగాణా ప్రజలలో సోదరభావం ఏర్పరచి ఉద్యమ స్ఫూర్తి రగిలించగలిగారని ఖచ్చితంగా చెప్పవచ్చును. అలాగే బతుకమ్మ ఉత్సవాలు పేరు చెప్పగానే ఆమె అందరికీ గుర్తుకు వచ్చేలా చేయగలిగారు కూడా.