ఈటలతో గులాబీ నేతల డిస్టెన్స్... ఎదురైనా పలకరించని ఎమ్మెల్యేలు

 

మంత్రి పదవి ఎవరి భిక్షా కాదు... గులాబీ జెండాకు మేము కూడా ఓనర్లమేనంటూ ధిక్కార స్వరం వినిపించిన ఈటలకు అసెంబ్లీలో వింత పరిస్థితి ఎదురైందట. నిన్నమొన్నటివరకు ఈటలను అభిమానించినవాళ్లు దూరం జరిగారట. బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంత్రి ఈటల ఎదురైనా అస్సలు పలకరించడానికే కొందరు ఎమ్మెల్యేలు ఇష్టపడకపోగా, మరికొందరు ఎందుకొచ్చిన తంటా అనుకుని, దూరం నుంచి చూసుకుని సైడైపోతున్నారట. ఇక అనుకోని పరిస్థితుల్లో ఎదురైతే మాత్రం చూపు పక్కకు తిప్పుకుని వెళ్లిపోతున్నారట. అసలు ఈటలతో మాట కలిపేందుకు సొంత పార్టీ ఎమ్మెల్యేలే హడలిపోతున్నారట. మృధుస్వభావిగా, అందరినీ ఆప్యాయంగా పలకరించే ఈటలను చూసి గులాబీ నేతలు తెగ భయపడిపోతున్నారట.

అయితే, ఈటల మాటల తూటాల ప్రకంపనలు సద్దుమణిగినట్లే అనిపించినా, పార్టీలో మాత్రం అలజడి కొనసాగుతోంది. ఈటల వేసిన బాటలోనే పలువురు ధిక్కారస్వరం వినిపించడంతో గులాబీ అధిష్టానం రగిలిపోతోందట. దాంతో టీఆర్ఎస్ లీడర్లు ఈటల పేరు ఎత్తడానికే భయపడిపోతున్నారట. పొరపాటున ఈటలతో మాట్లాడితే, తమను కూడా అదే బ్యాచ్ గాటన కట్టేస్తారని జంకుతున్నారట. అందుకే అసెంబ్లీ లోపలా బయటా ఎక్కడైనాసరే ఈటలతో మాట్లాడటానికి వెనకడుగు వేస్తున్నారట. ఈటలతో మాట్లాడితే అధిష్టానానికి కోపమొస్తందనే భావనతో కనీసం మర్యాదపూర్వకంగానైనా పలకరించడం లేదట. ఈటల అలా వస్తుంటే, పక్కకుతప్పుకుని వెళ్లిపోతున్నారట. ఒకవేళ ముఖాముఖిగా ఎదురైతే మాత్రం ఏదో పలకరించామంటే పలకరించామన్నట్లుగా విష్ చేస్తున్నారట.

అయితే, అసెంబ్లీలో తనకెదురవుతోన్న పరిస్థితులు, పార్టీలో పరిణామాలు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తీరు ఈటలకు తీవ్ర ఇబ్బందికరంగా మారిందట. మరి ఈటలకు దూరం పాటించాలని హైకమాండ్ నుంచి పార్టీ లీడర్లకు ఏమైనా ఆదేశాలు వచ్చాయా? లేక నిజంగానే ఈటలతో మాట్లాడితే ఎక్కడ తంటా వస్తుందని సైడవుతున్నారో తెలియదు గానీ, మొత్తానికి ఈటలతో మాత్రం డిస్టెన్స్ మెయింటైన్స్ చేస్తున్నారు. ఇదిలాఉంటే, ఈటల పరిస్థితిపై పార్టీ శ్రేణుల్లో వింతైన చర్చ జరుగుతోంది. ఒకే ఒక్క ప్రసంగం ఎంత పనిచేసింది.... సీన్ మొత్తం రివర్స్ అయ్యేలా చేసిందే... అంతలోనే ఎంత మార్పు అంటూ చర్చించుకుంటున్నారు.