సెల్.. మోహన రంగా

 

 

 

ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా సెల్ ఫోన్లే. వెయ్యి రూపాయలు కూడా అక్కర్లేకుండానే ఫోన్లు వచ్చేస్తున్నాయి. సరిగ్గా ఈ అందుబాటునే నాయకులు ఉపయోగించుకుంటున్నారు. వాటిద్వారా ప్రజలతో నేరుగా మాట్లాడేందుకు, వాళ్ల సమస్యలు వినేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ఈవిషయంలో కొంత ముందున్నారు.


సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, మహిళా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు,  యువజన సంఘాల ప్రతినిధులు, రైతులు, కవులు, కళాకారులు, రచయితలు, కుల సంఘాల సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో పాటు అన్ని వర్గాల ప్రజల సెల్‌ఫోన్ నంబర్లను సేకరించడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని నియమించారు. వాళ్లు ఇప్పటికే వేలాది సెల్‌ఫోన్ నంబర్లను సేకరించారు. నెంబరుతో పాటు వారి పుట్టినరోజు తేదీలు, మరిన్ని వివరాలను నమోదు చేస్తున్నారు.

సేకరించిన సెల్‌ఫోన్ నంబర్ల ద్వారా హరీష్‌రావు నేరుగా వారి పేరుతో పలకరించేలా ఆధునిక టెక్నాలజీ వినియోగిస్తున్నారు. ప్రత్యేక రోజుల్లో శుభాకాంక్షలు తెలియజేస్తారు. అభివృద్ధి పనులను ప్రచారం చేయడంతో పాటు సమస్యలను తెలుసుకోవడానికి టోల్‌ఫ్రీ నంబరును త్వరలో ప్రకటించబోతున్నారు. ఏ ఊరికి ఎప్పుడు వస్తారో ప్రజలకు నేరుగా సమాచారం అందడానికి ఏర్పాట్లు చేశారు.  ఈ హైటెక్ ప్రచారం త్వరలోనే అందరూ అందిపుచ్చుకునే అవకాశం ఉంది.