TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కుటుంబం సూసైడ్ కేసులో ఎమ్మెల్యే కొడుకు పరారీ.. తనకు సంబంధం లేదంటూ వీడియో

Published on: Tue Jan 4, 2022 8:00AM

అధికార పార్టీ ఎమ్మెల్యేపై పోలీసు కేసు నమోదు కావడం, ఆయన పరారీలో ఉండటం సంచలనంగా మారింది. ఎమ్మెల్యే కొడుకుపై కేసు నమోదైందని పోలీసులు కూడా ప్రకటించారు. పరారీలో ఉన్న అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఆయన లొకేషన్ ట్రేస్ చేస్తున్నామని.. ఆయన కోసం ప్రత్యేక టీమ్‌లు గాలింపు చర్యలు చేపట్టాయన్నారు.ఈ ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే తనయుడిని వెంటనే అరెస్ట్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో రామకృష్ణ అనే వ్యక్తి తన కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్ లో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవేందర్ పేరు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు రాఘవేందర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని పాల్వంచ ఏఎస్పీ తెలిపారు.ఈ నేపథ్యంలో, ఎమ్మెల్యే వనమా కుమారుడు రాఘవేందర్ ఓ వీడియో ద్వారా స్పందించారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో తన జోక్యం లేకపోయినా తన పేరు ఎందుకు రాశారో అర్థం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

 తమది రాజకీయ కుటుంబం అని, పనుల కోసం వందలమంది వస్తారని వివరించారు. ఆర్థిక పరిస్థితి బాగాలేక చనిపోతే నాకేంటి సంబంధం? అని రాఘవేందర్ ప్రశ్నించారు.
ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ వ్యవహారంలో తన ప్రమేయం ఉందని నిరూపితమైతే ఎంతటి శిక్షకైనా సిద్ధమేనని ప్రకటించారు. తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలని రామకృష్ణకు చెప్పడం నేరమా? అని ఆక్రోశించారు. ఈ కేసులో తనను ఇరికించేందుకు కొందరు కుట్ర చేశారని రాఘవేందర్ ఆరోపించారు. తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు పథకం ప్రకారం చేశారని అన్నారు. తనను అభాసుపాలు చేసేందుకు రామకృష్ణను ప్రలోభపెట్టారని, ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. 

కొత్తగూడెం జిల్లాలో సంచలనంగా మారిన పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. రామకృష్ణ సూసైడ్ నోట్‌లో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు రాఘవేంద్ర పేరు రాసి ఉన్నట్లు లేఖ బయటపడింది. లెటర్‌లో రామకృష్ణ అక్క మాధవి, తల్లి సూర్యవతి పేర్లు కూడా ఉన్నాయని.. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని ఏఎస్పీ తెలిపారు. తన అక్కకి ఎమ్మెల్యే కొడుకు రాఘవతో అక్రమ సంబంధం ఉన్నట్లు లేఖలో రాయడం కలకలం రేపుతోంది. ఆ కారణంగానే తనకు అన్యాయం జరిగిందని.. అందుకే తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రామకృష్ణ రాసిన లేఖలో పేర్కొన్నాడు.

తొలుత ఇంట్లో గ్యాస్ లీకై రామకృష్ణ కుటుంబం మంటల్లో కాలిపోయి చనిపోయిందని అంతా భావించారు. అర్ధరాత్రి వేళ గ్యాస్ లీక్ కావడంతో మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారని భావించినప్పటికీ సూసైడ్ నోట్, ఇంకా కీలక పత్రాలు లభ్యం కావడంతో ఆత్మహత్య చేసుకున్నారని నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని గ్యాస్ లీక్ చేసుకుని నిప్పు అంటించుకున్నట్లు భావిస్తున్నారు. మంటలు తాళలేక ఒక కుమార్తె బయటకు పరిగెత్తుకు రావడంతో గాయాలతో బయటపడింది. రామకృష్ణ, ఆయన భార్య, మరో కూతురు మంటల్లో కాలిపోయారు.