రాజకీయాల నుండి తప్పుకుంటున్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే.!!

ఇకపై రాజకీయాల్లో కొనసాగలేనని రామగుండం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ప్రకటించారు.. తాజాగా సింగరేణి కార్మికులతో భేటీ అయిన ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌లో తనకు గౌరవం లేదని అన్నారు.. పార్టీలో అవినీతిపరులను ప్రోత్సహిస్తున్నారని, పార్టీలో క్రమశిక్షణ లోపించిందని ఆరోపించారు.. భవిష్యత్‌లో రాజకీయ సన్యాసం తీసుకుంటానని తెలిపారు.. పదవుల్లో ఉంటానని విధులకు హాజరుకానని సోమారపు సత్యనారాయణ స్పష్టం చేశారు.. వివరాల్లోకి వెళ్తే, రామగుండం మున్సిపాలిటీలో వర్గ పోరు టీఆర్‌ఎస్ పార్టీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది.. ఇండిపెండెట్ అభ్యర్థి లక్ష్మీనారాయణను అధిష్టానం మేయర్‌గా నియమించింది.. అయితే ఆయన వ్యవహారశైలిని మొదటి నుంచి టీఆర్ఎస్ కార్పొరేటర్లు, స్థానిక ఎమ్మెల్యేలు తప్పుబడుతున్నారు.. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ గత కొద్ది రోజులుగా మేయర్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. ఈ క్రమంలో మేయర్‌పై కార్పొరేటర్లు జిల్లా కలెక్టర్‌కు అవిశ్వాస నోటీసు ఇచ్చారు.. నేడో రేపో అవిశ్వాస తీర్మానం జరగాల్సి ఉండగా.. నోటీసులు వెనక్కి తీసుకోవాల్సిందిగా  అధిష్టానం, సత్యనారాయణపై ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.. అధిష్టానం నుంచి ఒత్తిళ్లు ఏర్పడుతున్న నేపథ్యంలో తాను పార్టీలో కొనసాగలేనని సోమారపు సత్యనారాయణ స్పష్టం చేసారు.