బతుకమ్మలపై నుంచి దూసుకెళ్లిన కారు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు మహిళల శాపనార్ధాలు..
Published on: Thu Oct 7, 2021 12:56PM
తెలంగాణలో బతుకమ్మ వేడుకలు సంబరంగా మొదలయ్యాయి. తొలి రోజు ఎంగిలి పువ్వు బతుకమ్మను మహిళలు వైభవంగా నిర్వహించుకున్నారు. బతుకమ్మ ఉత్సవాలకు టీఆర్ఎస్ సర్కార్ ఘనంగానే ఏర్పాట్లు చేసింది. అయితే ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే మాత్రం బతుకమ్మ రోజే చిల్లరగా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి.
మహిళలంతా బతుకమ్మలతో వచ్చి భక్తి శ్రద్ధలతో బతుకమ్మ ఆడుతుండగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు ఆ బతుకమ్మల మీదుగా దూసుకెళ్లింది. దీంతో బతుకమ్మలు చెల్లాచెదరయ్యాయి. ఆ సమయంలో ఎమ్మెల్యే వాహనంలోనే ఉన్నారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ మహిళలు శాపనార్థాలు పెట్టారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ గ్రామస్థులు నినాదాలు చేశారు.బతుకమ్మలపై దూసుకెళ్లిన కారు పరకాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిది.
ఆత్మకూరు గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూరుకు విచ్చేసిన చల్లా ధర్మారెడ్డి అక్కడ సెంట్రల్ లైటింగ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. అదే సమయంలో పోచమ్మ సెంటర్ వద్ద ఉన్న వేణుగోపాలస్వామి దేవాలయం ఎదుట మహిళలు బతుకమ్మలు పెట్టుకొని ఆడుకుంటున్నారు. ఎమ్మెల్యే వస్తున్నారని, రోడ్డుపై నుంచి బతుకమ్మలు తీసివేయాలని ధర్మారెడ్డి అనుచరులు కోరారు. ఎంతో భక్తితో ఆడుకుంటున్న బతుకమ్మలను మధ్యలో తీసివేయలేమని మహిళలు తేల్చి చెప్పారు. అక్కడే ఉన్న సర్పంచ్ పర్వతగిరి రాజు ఓ పక్క నుంచి ఎమ్మెల్యే కారు పోనివ్వండిని ప్రాధేయపడ్డా పోలీసులు, అనుచరులు వినిపించుకోలేదు.
బతుకమ్మ ఆడుతున్న మహిళలను తోసేసి ఎమ్మెల్యే కారును బతుకమ్మల మీదుగా ముందుకు పోనివ్వడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ధర్మారెడ్డి కారును గ్రామస్థులు, మహిళలు అడ్డుకుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రామస్థులను పోలీసులు తోసేయడంతో కొందరు సోమ్మసిల్లి కిందపడిపోయారు. ఆత్మకూరు సీఐ రంజిత్.. అదనపు పోలీసులను రప్పించి అక్కడి నుంచి ఎమ్మెల్యే వాహనాన్ని పంపించారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మహిళలు ఎంతో గౌరవంగా పూజించే బతుకమ్మలపై కారు పోనివ్వడంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.


