TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నా కారునే అపుతారా.. ఎంత ధైర్యం? పోలీసులపై ఎమ్మెల్యే బంధువు చిందులు 

Published on: Mon May 24, 2021 6:42PM

తెలంగాణలో లాక్ డౌన్ అమలవుతోంది. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసులను ఆదేశించారు. సర్కార్ ఆదేశాలతో గత నాలుగు రోజులుగా పోలీసులు అత్యంత కఠినంగా వ్యహరిస్తున్నారు. కారణం లేకుండా రోడ్లపైకి వస్తున్న వాహనాలను సీజ్ చేస్తున్నారు. గుంపులుగా తిరుగుతున్నవారిపై లాఠీ ఝుళిపిస్తున్నారు. పోలీసుల చర్యలతో లాక్ డౌన్ పటిష్టంగానే అమలవుతోంది. లాక్ డౌన్ అమలుకు జనాలు సహకరిస్తున్నా... కొందరు నేతలు మాత్రం బరి తెగిస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు తమకు రూల్స్ వర్తించవు అన్నట్లుగా ఇష్టమెచ్చినట్లుగా తిరుగుతున్నారు. రూల్స్ పాటించకుండా వెళుతున్న కారును ఆపిన పోలీసులపై... అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే బంధువు ఓ రేంజ్ లో రెచ్చిపోయాడు. పోలీసులపై చిందులు వేసిన ఆ నేత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. అయితే పెద్దపల్లి వైపు నుంచి వస్తున్న కారును పోలీసులు ఆపి వివరాలు అడిగారు. ఇంకేముంది కారులో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ‘‘నేను పెళ్లికి వెళ్తున్నాను. నేను ఎవరనుకుంటున్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే తమ్ముడిని. నా కారునే అపుతారా.. ఎంత ధైర్యం? మేమిచ్చే డబ్బులతో డ్యూటీ చేస్తూ మేమంటే మీకు లెక్క లేదా’’ అంటూ రెచ్చిపోయాడు. 

పోలీసులపై దురుసుగా వ్యవహరించిన ఆ నేత పేరు దాసరి అంజిరెడ్డి. అధికార పార్టీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సమీప బంధువు. తనను ఎవరడ్డుకుంటారన్న ఆలోచనతో డ్యూటీలో ఉన్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే ఈ తతంగాన్ని మొత్తం  అక్కడ ఉన్నవారు వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు అంజిరెడ్డిపై కేసు నమోదు చేశారు. అయితే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోను స్థానిక నేతలు ఒత్తిడి మేరకు తొలగించారు.