కారు పని ఖతం! సభ్యులు కావలెను..

70 లక్షల సైన్యం. ఇది గులాబీ దళం బలగం. కేసీఆర్, కేటీఆర్ ఎప్పుడూ గొప్పగా చెప్పుకునే సంఖ్య. ఇన్నేళ్లూ ఏమో కానీ, ఇప్పుడా లెక్క తప్పింది. పాతాళానికి పడిపోతోంది. టీఆర్ఎస్ ది బలుపు కాదు వాపు అని తేలిపోతోంది. ఈ యేడాది నిర్వహిస్తున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిస్సారంగా సాగుతోంది. కారు పార్టీలో చేరేందుకు ప్రజలెవరూ ఆసక్తి చూపడం లేదు. పెద్ద ఎత్తున చేపట్టాలని చూసిన మెంబర్ షిప్ రిజిస్ట్రేషన్ ప్రొగ్రామ్ ప్రజాదరణ లేక తుస్సు మంది. గులాబీ నేతల్లో కలవరం మొదలైంది. 

కొంత కాలంగా టీఆర్ఎస్ గ్రాఫ్ దారుణంగా పడిపోతోంది. దుబ్బాకలో కారు పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టారు ఓటర్లు. జీహెచ్ఎమ్సీ ఎలక్షన్లో గెలిచి ఓడిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థే కరువు. నాగార్జున సాగర్ లో ప్రజలు నిండా ముంచేస్తారనే భయం. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ లలో గెలుపు అతి కష్టమే. ఇలా.. కారు పార్టీ నాలుగు టైర్లూ పంక్ఛర్ అయ్యాయి. ప్రజాక్షేత్రంలో పరువంతా పోయి ఇంచు కూడా ముందుకు కదలలేని దుస్థితి. ఇలాంటి నిస్సహాయ సమయంలో కార్యకర్తల బలం సమకూర్చుకునేందుకు పార్టీ సభ్యత్వ నమోదును చాలెంజింగ్ గా తీసుకున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అనేక సార్లు మీటింగ్ లు, రివ్యూలతో పార్టీ నేతలను సమాయత్తం చేశారు. ఒక్కో నియోజక వర్గానికి 50వేల మందిని సభ్యులుగా చేర్చాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. అయితే.. సమయం ముగిసే నాటికి లక్ష్యం సగం కూడా పూర్తవలేదు. 50వేల మంది దేవుడెరుగు.. అందులో సగం మంది కూడా పార్టీ తీర్థం తీసుకునేందుకు ముందుకు రాలేదు. అధికార పార్టీపై ప్రజల్లో అంతటి వ్యతిరేకత వచ్చిందంటున్నారు. 

పార్టీ మెంబర్ షిప్ లు అంతంత మాత్రంగానే అవుతుండటంతో చిన్న బాస్ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారట. ఇలాగైతే ఎలా? పార్టీ ఇజ్జత్ ఏమై పోతుందంటూ నేతలను నిలదీశారని చెబుతున్నారు. ఇటు కేటీఆర్ కస్సుమనడం, అటు జనాలు ఛీ కొడుతుండటంతో.. ఏం చేయాలో తెలీక తలపట్టుకుంటున్నారట టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అందుకే, చిన బాస్ కు తెలీకుండా ఓ కన్నింగ్ ప్లాన్ అమలు చేస్తున్నారని అంటున్నారు. ప్రజలు ఎలాగూ పార్టీ సభ్యత్వం తీసుకోవడం లేదు కాబట్టి, వారి పేరు మీదుగా టీఆర్ఎస్ లీడర్లే మెంబర్ షిప్ లు తీసేసుకుంటున్నారట. ఎవరిదో పేరు రాసి.. రిజిష్టర్ లో నేమ్ ఎంటర్ చేసి.. పార్టీ మెంబర్ షిప్ ను అమాంతం పెంచేస్తున్నారట. అయినా, కేటీఆర్ పెట్టిన నియోజక వర్గానికి 50వేల సభ్యత్వాల లక్ష్యాన్ని చేరుకోవడం అతికష్టంగా మారింది. ఆ సంఖ్య చేరుకోలేక, కేటీఆర్ తో తిట్లు తినలేక.. నానా తంటాలు పడుతున్నారు జిల్లా స్థాయి నేతలు. 

గ్రౌండ్ లెవల్ లో టీఆర్ఎస్ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. కేటీఆర్ మాత్రం పార్టీ సభ్యత్వాలు 70 లక్షలకు చేరుకున్నాయంటూ ప్రకటించడం విచిత్రంగా ఉందంటున్నారు. నవ్వి పోదురు గాక నాకేంటి అన్నట్టు ఉంది టీఆర్ఎస్ తీరని ఎద్దేవా చేస్తున్నారు. తెలంగాణలో ఇక గులాబీ పార్టీకి భవిష్యత్ లేదని.. అందుకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అవడమే నిదర్శనమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. పైకి గంభీరంగా కనిపిస్తున్నా.. గులాబీ పార్టీ గుండెల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయని అంటున్నారు.