తెరాస ఉనికిని కాపాడుకొనేందుకే విద్వేష ప్రచారం

 

తెరాస నేతలు తాము బంద్ కు పిలుపునిచ్చినప్పటికీ, ఏపీఎన్జీవోల ‘సేవ్ ఆంధ్రప్రదేశ్' సభ ఊహించినదాని కంటే చాలా విజయవంతంగా ముగియడంతో సహజంగానే జీర్ణించుకోలేకపోతున్నారు.

 

సభ సందర్భంగా వేలాది మంది తరలి వస్తున్నపుడు బయట జరిగిన చిన్నచిన్నసంఘటనలను, సభలో పోలీస్ కానిస్టేబుళ్ళు శ్రీనివాస్, శ్రీశైలంలపై జరిగిన దాడి, సభలో జరిగిన అవకతవకలను, నేతల ప్రసంగాల వంటివి వాటిని తెరాస నేతలు భూతద్దంలో ఎత్తి చూపుతూ, ఆవేశంతో ఉన్నతెలంగాణా ప్రజలను మరింత రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా తెరాస నేతలు ప్రజాగ్రహాన్నితమకు అనువుగా మలచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, తెలంగాణా కాంగ్రెస్ నేతలు కూడా జరిగిన యావత్ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నపటికీ, ఈ విషయంలో వారందరూ చాలా సంయమనంతో మాట్లాడటం గమనార్హం. అందుకు వారిని మెచ్చుకోక తప్పదు.

 

కాంగ్రెస్ తీసుకొన్నవిభజన నిర్ణయంతో తెరాస ఉనికి ప్రశ్నార్ధకమవగా, తెలంగాణాలో టీ-కాంగ్రెస్ పరిస్థితి చాలా మెరుగుపడింది. ఆ దుగ్ధతోనే తెరాస నేతలు తెలంగాణా ప్రజలను రెచ్చగొట్టేందుకు శతవిధాల ప్రయత్నిస్తూ వారి ఆగ్రహాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని తిప్పలు పడుతున్నారు.

 

హైదరాబాదులో ఏపీఎన్జీవోలు సభ నిర్వహించడం నిజంగానే బల ప్రదర్శన అని ఒప్పుకోక తప్పదు. బల ప్రదర్శనకు వచ్చిన వారు, అందుకు అనుగుణంగానే ప్రవర్తిస్తారు తప్ప నాలుగు శాంతి ప్రవచనాలు చెప్పుకొని ‘మమ’ అనుకోని వెళ్లిపోరనేది తెరాస నేతలకు కూడా తెలుసు. ఈ సందర్భంగా తెరాస నేతలు మిలియన్ మార్చ్ సందర్భంగా జరిగిన విగ్రహాల విద్వంసం ఒకసారి గుర్తుకు తెచ్చుకొంటే మంచిది. ఒకవేళ ఆ రోజు వారికి ఎవరయినా సమైక్యవాది ఎదురుపడి ‘జై సమైక్యాంధ్ర’ అని నినదించి ఉండి ఉంటే, అతనికీ సభలో పోలీస్ కానిస్టేబుల్ కి పట్టిన గతే పట్టేదనేది కాదనలేని సత్యం.

 

తెరాస నేత హరీష్ రావు సభకు వచ్చినవారికి ఆహారం, పాలు, పళ్ళు, పూలు ఇచ్చి గౌరవించాలని చెపితే, ఏపీఎన్జీవోలు తిరిగి వెళుతున్నపుడు వారి బస్సులపై కొందరు రాళ్ళతో దాడి చేసినపుడు కొంత మందికి గాయాలయ్యాయి. సమైక్యవాదులు తెలంగాణా విద్యార్ధులపై దాడి చేసారని ఆరోపిస్తున్నతెరాస నేతలు, ఈ దాడిని ఖండించలేదు, గాయపడినవారి పట్ల సానుభూతి చూపలేదు, కనీసం ఆ దాడిని ప్రస్తావించలేదు కూడా.

 

ఉద్రేకంగా ఉన్న రెండు సమూహాలు ఎదురయితే ఇటువంటి ఘర్షణలు తప్పవనే సంగతి తెలిసినప్పటికీ, తెరాస నేతలు ప్రజల మధ్య మరింత చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలకున్నతెలివిడి తెరాస నేతలకి లేక కాదు. కానీ తమ ఉనికిని కాపాడుకొనేందుకే వారు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతుంటారు.

 

ఒకసారి కేసీఆర్ , మరొకసారి ఈటెల, ఇంకోసారి హరీష్ రావు ప్రజలను రెచ్చగొడుతూ తెలంగాణా వేడిని కొనసాగిస్తుంటారు. ఈ నేతలందరూ మళ్ళీ అదే నోటితో ఆంధ్రా వాళ్ళని కడుపులో పెట్టుకొని కాపాడుతామని పలకడం చూస్తుంటే నోటితో నీతులు పలుకుతూ, నొసటితో వెక్కిరిస్తున్నట్లుంటుంది.