బీజేపీలోకి స్వామి గౌడ్! కారుకు ఇక పంక్చర్లేనా?

టీఆర్ఎస్ లో అసమ్మతి బాంబ్ పేలబోతుందా? కేసీఆర్ కు షాకిచ్చేందుకు నేతలు ఒక్కొక్కరుగా సిద్ధమవుతున్నారా? కారు పార్టీకి ఇకపై వరుస కష్టాలేనా? తెలంగాణలో జరుగుతున్న రాజకీయ మార్పులతో జనాల్లో ఇదే చర్చ జరుగుతోంది. శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ బీజేపీలో చేరడంతో.. ఆయన బాటలోనే మరికొందరు గులాబీ నేతలు కమలం గూటికి చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. కేసీఆర్ తీరుపై గుర్రుగా ఉన్న నేతలంతా బయటికి రాబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. 

 

శాసనమండలి మాజీ చైర్మెన్ స్వామి గౌడ్ కొంత కాలంగా కేసీఆర్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. శాసనమండలి చైర్మెన్ పదవి కాలం ముగిసాకా ఆయనను పట్టించుకోవడమే మానేశారట టీఆర్ఎస్ పెద్దలు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ నుంచి పోటీకి సిద్ధమైన స్వామి గౌడ్ కు టికెట్ ఇవ్వలేదు. లోక్ సభ ఎన్నికల్లో చేవెళ్ల టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినా అది కూడా జరగలేదు. దీంతో కేసీఆర్ వైఖరి, టీఆర్ఎస్ సర్కార్ పై చాలా సార్లు అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తపరిచారు స్వామి గౌడ్. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులందరిని ఏకం చేసిన తనకు ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత దక్కడం లేదని ఆయన ఆగ్రహంగా ఉన్నారనే ప్రచారం జరిగింది. రెండు నెలల క్రితం కూడా హాట్ కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ లో బీసీ నేతలను పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. దీంతో స్వామి గౌడ్ పార్టీ మారతారని ప్రచారం జరిగినా ఆయన ఖండిస్తూ వచ్చారు. 

 

దుబ్బాక ఉప ఎన్నిక విజయంతో స్పీడ్ పెంచిన బీజేపీ.. మూడేళ్ల తర్వాత జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే గులాబీ పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఇటీవలే స్వామిగౌడ్‌తో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ నేత లక్ష్మణ్‌ సమావేశమై బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు. అయితే అప్పుడు చేరికను నిర్దారించని స్వామి గౌడ్.. ఢిల్లీకి వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. స్వామి గౌడ్ చేరికతో గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి భారీగా ప్రయోజనం కలగనుంది కమలం నేతలు చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులను ఏకతాటిపై నడిపిన స్వామి గౌడ్ కు.. ఇప్పటికే ఉద్యోగ సంఘాలపై పట్టుంది. గ్రేటర్ ఓటర్లలో లక్షలాది మంది ఉద్యోగులు ఉన్నారు. వారంతా ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేయవచ్చని భావిస్తున్నారు. నగరంలోని గౌడ సామాజిక వర్గం కూడా బీజేపీ వైపు మెగ్గుచూపుతుందని భావిస్తున్నారు. 
                

స్వామి గౌడ్ బీజేపీలో చేరడంతో తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. స్వామి గౌడ్ బాటలోనే చాలా మంది టీఆర్ఎస్ నేతలు కారు దిగి కమలం గూటికి చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన చాలా మంది నేతలకు ఇప్పటి వరకు ఎలాంటి పదవులు రాలేదు. అలాంటి వారంతా బీజేపీలో చేరుతారని చెబుతున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ బీటీ, యూటీ బ్యాచ్ లుగా విడిపోయిందన్న చర్చ జరుగుతోంది. బంగారు తెలంగాణ.. బీటీ బ్యాచ్ హవానే పార్టీలో సాగుతుందని.. ఉద్యమ తెలంగాణ నేతలకు అన్యాయం జరుగుతుందన్న విమర్శలు ఉన్నాయి. పలుసార్లు స్వామిగౌడ్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. దీంతో ఇప్పుడు యూటీ బ్యాచ్ నేతలంతా బీజేపీ వైపు వస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు కమలం నేతలతో టచ్ లోకి వచ్చారని చెబుతున్నారు. గ్రేటర్ ఎన్నికల్ల బీజేపీ విజయం సాధిస్తే .. ఆ పార్టీలోకి వలసలు మరింత పెరుగుతాయంటున్నారు. 

 

మరోవైపు స్వామి గౌడ్ చేరికతో తమకు మరింత బలం వచ్చిందని భావిస్తున్న తెలంగాణ బీజేపీ నేతలు.. గ్రేటర్ ఎన్నికల పోలింగ్ కు ముందే మరిన్ని చేరికలకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. గ్రేటర్ ప్రచారానికి జేపీ నడ్డా రానుండటంతో.. ఆయన సమక్షంలో మరికొందరు టీఆర్ఎస్ నేతలు కాషాయ కండువా కప్పుకునేలా కసరత్తులు చేస్తున్నారట. మొత్తంగా స్వామి గౌ]డ్ తో మొదలైన టీఆర్ఎస్ నుంచి జంపింగ్ లు కొనసాగుతూనే ఉంటాయని, టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి ఊహించని విధంగా చేరికలు ఉంటాయని తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు. కొందరు పెద్ద నేతలు కూడా కమలం పెద్దలతో మాట్లాడుతున్నారని కూడా బాంబ్ పేల్చుతున్నారు.