కేసీఆర్‌కు షాక్.. బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే జంప్..
Published on: Mon Apr 4, 2022 4:39PM
ఇంకా ఎన్నికలే రాలేదు.. అప్పుడు అధికార టీఆర్ఎస్ నుంచి వలసలు మొదలయ్యాయి. దాదాపు 20 మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ గతంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇక గోడ దూకబోయే మాజీల సంఖ్య అయితే లెక్కేలేదని అంటున్నారు. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ.. తాజాగా టీఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యే బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. కారు నుంచి కమలానికి క్యూ కట్టడం మొదలుపెట్టారు.
ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ బీజేపీలో జాయిన్ అవుతున్నట్టు లేఖ విడుదల చేశారు. "ఆలేరు అభివృద్ధి, ప్రజల కష్టాలు తీర్చేందుకు 2018లో టీఆర్ఎస్‌లో చేరా. అభివృద్ధిలో నన్ను భాగస్వామిని చేస్తారని భావించా. ఇక్కడి ప్రజలు, నన్ను వేరు చేసేందుకు కుట్ర చేశారు. ఇక్కడ తిరగొద్దని.. ప్రజలను కలవొద్దని గులాబీ పెద్దలు ఆదేశించారు. మూడేళ్లుగా ఆలేరు ప్రజలను కలవకుండా కట్టడి చేశారు. ప్రజల నుంచి దూరం చేయాలన్న కుట్రను నేను ఛేదించాను. ఆలేరు ప్రజలకు సేవ చేసేందుకే బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నా" అని భిక్షమయ్య గౌడ్ ఆ లేఖలో తెలిపారు.
భిక్షమయ్య గౌడ్‌తోనే వలసలు మొదలయ్యాయని, ముందుముందు ఈ సంఖ్య భారీగా ఉండబోతోందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. అతి త్వరలోనే పాలమూరు జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కాషాయ కండువా కప్పుకోనున్నారని చెబుతున్నారు. ఇక, జిల్లాల వారీగా ఇప్పటికే డీల్స్ జరుగుతున్నాయని.. ముందే బీజేపీలో చేరే వారు కొందరైతే, టికెట్ రాకపోతే కారు దిగాలనే ఆలోచనలో ఉన్నవారు మరికొందరు. అయితే, బీజేపీలో ఇప్పటికే ఫుల్ డిమాండ్ ఉండటంతో.. గతంలో మాదిరి కాకుండా.. ఎలక్షన్లకు ఆరు నెలలు ముందుగానే ఎమ్మెల్యే అభ్యర్థులను అనధికారికంగా రెడీ చేసుకోవాలనేది బీజేపీ వ్యూహం. అందుకే, వలసలు చివరిక్షణంలో కంటే ఈసారి ముందే ఉంటాయని అంటున్నారు.



