TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

'గ్రేటర్..' మాయలో 'ఆంధ్రోళ్ల' భజన

Published on: Sat Jan 9, 2016 2:06PM

TRS ANDHRA PLAN FOR GHMC ELECTIONS, TRS GHMC Elections 2016,  KCR KTR, TELUGU POLITICAL NEWS

 

తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలుగోళ్ల మధ్య లెక్కలు తెచ్చి.. ఆంధ్ర, తెలంగాణ అని ప్రతి విషయాన్ని ప్రాంతీయంగా విభజించి మాట్లాడిన టీఆర్ఎస్ పార్టీ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వచ్చేసరికి తమ తీరును క్షణాల్లో మార్చేసినట్టు రాజకీయవర్గాల టాక్. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆంధ్రోళ్ల ఓట్లు కీలక౦. దీంతో ఆంధ్రోళ్లను ఆకట్టుకొనేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్, తెలంగాణా మంత్రి కేటీఆర్‌ వారి భజనను అందుకున్నారని రాజకీయ వర్గాలలో, సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి.

 

ఇటీవల కూకట్‌పల్లిలో జరిగిన సభలో మాట్లాడిన కేటీఆర్‌.. ఆంధ్రోళ్ల నామస్మరణం చేశారు. అంతేకాదు ఇక్కడ అందరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. టీఆర్ఎస్ ఇక తెలుగు రాష్ట్రసమితిగా మారబోతు౦దంటూ ప్రకటించారు. అలాగే తాను భీమవరం నుంచి పోటీ చేస్తానని చెప్పి..అక్కడికి వచ్చిన ప్రజలని ఆకట్టుకొనేందుకు ప్రయత్నించాడు. అలాగే ఆంధ్రవారి గొప్పతనం నుంచి గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నడూ పెదవి విప్పని కేసీఆర్ ..జాతీయ స్థాయి బిల్డర్ సదస్సులో మాత్రం ఆంధ్రవాళ్ళ గొప్పతనం గురించి చెప్పుకొచ్చారు. నెల్లూరుకు చెందిన శీనయ్య కంపెనీ గొప్పతనాన్ని కీర్తించట౦ ఆశ్చర్యకరంగా వుందని రాజకీయ నిపుణులు అంటున్నారు.  

కేసీఆర్, కేటీఆర్ మాత్రమే కాదు తెలంగాణ జిల్లాల మంత్రులంతా గ్రేటర్ లోని ఆంధ్రవాళ్ళ చూట్టూ చేరారట. తమకు కేటాయించిన నియోజక వర్గాలు, డివిజన్లలో సమావేశాలు నిర్వహిస్తున్నారట. ముఖ్యంగా ఆంధ్రవాళ్ళు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ఎక్కువగా దృష్టి సారిస్తున్నారట. ఆంధ్ర ప్రాంతానికి చెందిన పెద్ద సంఖ్యలో ఉన్న..వివిధ కులాలకు చెందిన కుల సంఘాల సమావేశాల్లో సైతం పాల్గొంటున్నట్టు రాజకీయ వర్గాలు అంటున్నాయి. విభజనతో ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయని, తెలంగాణ ఏర్పాటు దీనికి దోహదం చేసిందని ప్రచారంలో వివరిస్తున్నారట. ఏ ప్రాంతానికి చెందిన వారైనా, ఏ రాష్ట్రానికి చెందిన వారైనా హైదరాబాద్‌లో ఉండే వారంతా హైదరాబాదీలేనని, ఎవరి పట్లా ప్రభుత్వం వివక్ష చూపడం లేదని, అందరి కోసం పని చేస్తోందని చెబుతున్నారట. ఇదంతా జరగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం ఆంధ్ర ఓటర్లను ఆకట్టుకునేందుకు అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.  

మరి గ్రేటర్ ఎన్నికల మాయలో తెలంగాణ నేతలు చేస్తున్న 'ఆంధ్రోళ్ల' భజనకు వారు కరుణిస్తారా? గ్రేటర్ లోని ఆంధ్రవారి మనసు గెలుచుకొనేది ఎవరు ? ఈ సారి వారు ఎవరికి పట్టంకట్టబోతున్నారు? అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..!!