హుజూర్‌నగర్‌లో కేటీఆర్ VS ఉత్తమ్... నువ్వానేనా అంటూ ప్రచారం

హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక ప్రచారం హీటెక్కింది. ప్రధాన పార్టీలు టీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ నువ్వానేనా అంటూ ప్రచారం నిర్వహిస్తున్నాయి. టీఆర్ఎస్ నుంచి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. నల్గొండ పర్యటనలో భాగంగా గులాబీ శ్రేణులతో మంతనాలు జరిపారు. ఆరునూరైనా ఈసారి హుజూర్ నగర్ లో గులాబీ జెండా ఎగిరి తీరాలని దిశానిర్దేశం చేశారు. మొన్నటి ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి అత్తెసరు మెజారిటీతో గట్టెక్కారని, ఇక ఇప్పుడు హుజూర్ నగర్ నుంచి కాంగ్రెస్ ను తరిమేసే టైమొచ్చిందని అన్నారు. టీఆర్ఎస్ శ్రేణులంతా కసితో పనిచేసి హుజూర్ నగర్ లో గులాబీ జెండా ఎగరవేయాలని నేతలు, కేడర్ కు కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న అభివృద్ధి-సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని దిశానిర్దేశం చేశారు. ఇక, హుజూర్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి బీఫామ్ ఇఛ్చిన కేటీఆర్... టీఆర్ఎస్ సత్తా చాటి విజయగర్వంతో తిరిగిరావాలని సూచించారు.

అయితే, కాంగ్రెస్ కంచుకోటను బద్దలుకొట్టడం ఎవరి తరమూ కాదని నల్గొండ ఎంపీ, పీసీసీ చీఫ్ ఉత్తమ్ సవాలు విసిరారు. వరుసగా నాలుగోసారి హుజూర్ నగర్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే కాకుండా, 30వేలకు పైగా బంపర్ మెజారిటీతో పద్మావతి గెలవడం ఖాయమన్నారు ఉత్తమ్. ఇదిలాఉంటే, బీజేపీ కూడా హుజూర్ నగర్ పై గట్టిగా ఫోకస్ పెట్టడంతో బలమైన త్రిముఖ పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. మిగతా పార్టీలు పోటీలో ఉన్నా, నామమాత్రంగానే మారనున్నాయి. కేవలం టీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీ మధ్యే రసవత్తర పోరు జరగనుంది.