రాష్ట్ర విభజనతో ఎవరికి లాభం

 

తెలంగాణా రాష్ట్ర ఏర్పడటంతోనే కేసీఆర్ తన వద్దనున్న మంత్రదండం తిప్పిఅక్కడి ప్రజల సమస్యలన్నిటినీ, ఆ ప్రాంతం వెనకబాటుతనాన్ని చిటికలో మాయం చేసి పడేస్తానని ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతునారు.

 

ఆయన, తెరాస పార్టీ నేతలు నిజంగా తెలంగాణా ప్రజల సంక్షేమం కోరేవారయి ఉంటే తమకున్న రాజకీయ పరపతితో ఫ్లోరోసిస్ వ్యాధులతో సతమవుతున్న నల్గొండ ప్రజల కష్టాలను తీర్చగలిగేవారు. అర్ధాకలితో మాడుతూ పత్తి పొలాలలోపనిచేస్తూ తమ బాల్యం బుగ్గిపాలు చేసుకొంటున్నమహబూబ్ నగర్ జిల్లా బాలలను ఆదుకొనేవారు. రెక్కాడితే తప్ప డొక్కాడని బీడీ కార్మికుల జీవితాలకు వెలుగు చూపగలిగేవారు. సిరిసిల్లా నేతన్నల కష్టాలను తీర్చగలిగేవారు. ఉన్నఇల్లు, చివరికి భార్య మెడలో పుస్తెలు కూడా అమ్ముకొని, అప్పులు చేసి పొట్ట చేతితో పట్టుకొని గల్ఫ్ దేశాలకు పోయి నానా కష్టాలు పడుతున్నకరీంనగర్ జిల్లా ప్రజలకు ఉపాధి చూపగలిగేవారు. కానీ, తెరాస అటువంటి గొప్ప ఆలోచనలు ఏనాడు చేయలేదు. చేసి ఉంటే ఇన్ని సమస్యలు ఉండేవి కావు. సమస్యలు లేకపోతే ప్రజలు దాని మాటలు వినేవారు కారు.

 

అందుకే వాటిని అలాగే గాలికొదిలి తెలంగాణా ప్రజలను ఉద్దరించేందుకు కేసీఆర్ తనకు తానే స్వయంగా కిరీటం పెట్టుకొని, మంచి వాక్పటిమ గల తన కుటుంబ సభ్యులనే సైనికులుగా చేసుకొని ఉద్యమాలు మొదలుపెట్టి వందలాది యువకుల జీవితాలను బలి తీసుకొని, ఇంతవరకు ఏ కాంగ్రెస్ పార్టీని నోటికి వచ్చినట్లు తిట్టారో ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీతో కలిసి అధికారం పంచుకొనేందుకు ఆఖరి ఆట మొదలుపెట్టారు.

 

 స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా సీమాంధ్ర నేతలు, వ్యాపారులు తెలంగాణా ప్రజలని దోపిడీ చేసారని వాదిస్తున్నతెరాస ఇప్పుడు చేస్తున్నపనేమిటి? మరి ఇంత కాలంగా తెలంగాణా నుండి ఎన్నికవుతున్న కాంగ్రెస్, తెదేపా, తెరాస, బీజేపీ శాసనసభ్యులు, యంపీలు, మంత్రులు, కేంద్ర మంత్రులు తెలంగాణకు ఇంత అన్యాయం జరుగోతోందని తెలిసి మరి ఎందుకు అడ్డుకోలేదు? తెలంగాణా ప్రజల సమస్యలను ఇన్నేళ్ళలో ఎందుకు తీర్చలేకపోయారు?వారిని తెలంగాణా ప్రజల సంక్షేమం కోసం, ఆ ప్రాంత అభివృద్ధి పాటుపడకుండా ఎవరు అడ్డుకొన్నారు? అడ్డుకొని ఉంటే ఆనాడే వారు ఎందుకు గొంతెత్తలేదు?ఎందుకు పోరాడలేదు?

 

ఈ ప్రశ్నలన్నీ వట్టి అమాయక ప్రశ్నలుగా కొట్టిపారేయవచ్చును. కానీ, కాంగ్రెస్, తెరాస నేతలలో, ఇంకా చెప్పాలంటే తెలంగాణా నేతలలో తమ ప్రజల, తమ ప్రాంతం పట్ల చిత్తశుద్ది లేకపోవడం వలనే నేడు ఈ దుస్థితి ఏర్పడింది తప్ప వేరేవరి దోపిడీ కారణంగా మాత్రం కాదు.

 

ఇన్నేళ్ళలో అక్కడి రాజకీయ నేతలు, ఉద్యమ నేతలు పది తరాలకు సరిపడేంత ఆస్తులు సంపాదించుకొని, త్వరలో అధికారం కూడా దక్కించుకోబోతుంటే, వారి వెనుక నడచిన ప్రజల పరిస్థితి మాత్రం ఎక్కడ గొంగళి అక్కడే అన్నట్లుంది, ఉంటుంది కూడా. ప్రజల త్యాగాల ఫలితంగా ఏర్పడే కొత్త రాష్ట్రంలో అధికారం దక్కించుకొనేందుకు అర్రులు చాస్తున్నఈ రాజకీయ నేతలు రేపు తెలంగాణా రాష్ట్రం ఏర్పడగానే ఒక్కసారిగా మారిపోతారని అనుకొంటే అంతకంటే వెర్రి ఆలోచన మరొకటి ఉండదు.

 

ఇన్నేళ్ళుగా దేశంలో, వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వాలు వెలగబెడుతున్నకాంగ్రెస్ పార్టీ పాలనలో అక్కడి ప్రజల పరిస్థితి ఎలా ఉందో, రేపు ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలు ఏర్పడిన తరువాత కూడా అలాగే ఉంటుంది. రాష్ట్ర విభజన జరగగానే ఏ అద్భుతాలు జరిగిపోవు. కేవలం రాజకీయ సమీకరణాలు మారుతాయి, సదరు నేతల వ్యాపారాలు మరింత విస్తరిస్తాయి. తద్వారా వారు మరిన్ని ఆస్తులు కూడబెట్టుకొంటారు. కానీ ఇరుప్రాంతల ప్రజల పరిస్థితి మాత్రం ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లు ఉంటుంది. పైగా కొత్తగా మరికొన్ని సమస్యలు కూడా ఎదుర్కోకతప్పదు.