రైతన్నల ఆత్మహత్యలపై స్పందించే తీరు ఇదా

 

తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీలు రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వానికి తన బాధ్యత గుర్తు చేస్తుంటే, అవి ముఖ్యమంత్రి కేసీఆర్ కి అనవసర రాద్దాంతంగా కనిపించడం విస్మయం కలిగిస్తుంది. సమస్య తీవ్రతను గుర్తించి తక్షణమే దాని నివారణ చర్యలు చేపట్టవలసిన ప్రభుత్వం, ప్రతిపక్షాలు చేస్తున్న ఆ దుష్ప్రచారాన్ని బలంగా తిప్పి కొట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ నేతలమి, మంత్రులని కోరడం మరీ ఆశ్చర్యం కలిగిస్తుంది.

 

రైతుల ఆత్మహత్యల గురించి ప్రతిపక్షాలు ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుందనో మాట్లాడటం మానేసినా అవి దాచిపెడితే దాగేవి కావు. అదే విధంగా సున్నితమయిన ఆ సమస్యపై ప్రతిపక్షాలు శవ రాజకీయాలు చేస్తున్నాయనే వాదన చాలా తప్పు. రాష్ట్రంలో నిత్యం రైతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతుంటే ప్రభుత్వమూ పట్టించుకోక ప్రతిపక్షాలు పట్టించుకోకపోతే మరెవరు వారిని పట్టించుకొంటారు? ఈ సమస్యను రాజకీయ కోణంలో నుండి చూడటం మానుకొని మానవీయ కోణంలో చూడవలసిన అవసరం ఉంది.

 

ముఖ్యమంత్రి కేసీఆర్ నిత్యం ఏదో ఒక భారీ వ్యయం అయ్యే ప్రాజెక్టులను ప్రకటిస్తూనే ఉన్నారు. హుస్సేన్ సాగర్ పక్కన 150 అంతస్తుల భవనం నిర్మించకపోయినా ఎవరూ వేలెత్తి చూపరు. కానీ నిత్యం రైతులు ఆత్మహత్యలు చేసుకొంటే తప్పకుండా అందరూ వేలెత్తి చూపుతారు. నిలదీసి అడుగుతారు. దానిని అనవసర రాద్దాంతం అనుకొంటే అందుకు ఏదో ఒకనాడు రైతులకు జవాబు చెప్పుకోక తప్పదు. తెలంగాణా సిగ్నేచర్ టవర్స్ నిర్మాణానికి వందల కోట్లు వెచ్చించడానికి సిద్దపడుతున్నపుడు, రైతులకు హామీ ఇచ్చిన విధంగా ఒకేసారి రుణమాఫీ చేయకపోతే ప్రతిపక్షాలే కాదు ప్రజలు కూడా నిలదీయవచ్చును.

 

అయినా తెలంగాణా ధనిక రాష్ట్రమని, ఆర్ధికంగా దేశంలో ఏ-1 గ్రేడ్ గల రాష్ట్రమని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో గర్వంగా చెప్పుకొంటునప్పుడు రైతులను ఎందుకు ఆదుకోవడం లేదు? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. దానికి నేరుగా సమాధానం చెపితే సరిపోయేది. ఈ సమస్య పరిష్కారానికి తమ ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి వివరించి ఇంకా ఏమేమీ చేయవచ్చో ప్రతిపక్షాలను సలహా అడిగి ఉండి ఉంటే సమస్య పరిష్కారం అయ్యి ఉండేది. అందరూ హర్షించేవారు. కానీ ఈ సమస్య గురించి మాట్లాడినందుకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలందరినీ అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసి, బయట కూడా వారిని దీటుగా ఎదుర్కోమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా సూచించడం గర్హనీయం.

 

సమస్య ఎదురయితే దానిని పరిష్కరించేందుకు అన్ని మార్గాలను ఉపయోగించుకోవాలి. కానీ ఏడాదిన్నర పాలన చేసిన తరువాత కూడా ఇంకా ఈ పాపం గత ప్రభుత్వాలదేనని తప్పించుకోవాలని చూడటం సరికాదు. తెరాస ప్రస్తుతం అధికారంలో ఉంది కనుక ఇప్పుడు అది ఏవిధంగా వాదించినా చెల్లుతుంది. కానీ తీవ్రమయిన ఈ సమస్యను ఇలాగే విస్మరిస్తే మిగిలిన మూడున్నరేళ్ళలో ఇంకా అనేక అమంది రైతన్నలు ప్రాణాలు తీసుకొనే ప్రమాదం ఉంది. అప్పుడు ఈ ఐదేళ్ళకి తెరాసయే లెక్క చెప్పుకోవలసివస్తుంది. రైతన్నల ఉసురు ఎవరికీ మంచిది కాదు. కనుక ప్రతిపక్షాలను గట్టిగా ఎదుర్కొనే ఆలోచన చేయడం కంటే వాళ్ళతో కలిసి ఈ సమస్యను ఏవిధంగా నివారించవచ్చో ఆలోచిస్తే బాగుంటుంది.