తెరాస వ్యూహం బెడిసి కొట్టిందా?

 

తెలంగాణా రాష్ట్రంలో నానాటికీ తీవ్రమవుతున్న విద్యుత్ సంక్షోభంతో అటు రైతాంగానికి, ఇటు పారిశ్రామికవేత్తలకీ సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో చిక్కుకొన్న తెలంగాణా ప్రభుత్వం, అత్తమీద కోపం దుత్త మీద చూపినట్లుగా, తన కోపాన్ని తెదేపాపై ప్రదర్శించింది. ఈ విద్యుత్ సంక్షోభానికి చంద్రబాబే కారణమని ఆరోపిస్తూ తెరాస కార్యకర్తలు నల్గొండలో తెదేపా కార్యాలయంపై దాడి చేశారు. కానీ ఆవిధంగా చేసి తెరాస మరొక పెద్ద తప్పు చేసిందనే చెప్పవచ్చును. తెదేపాను దోషిగా చూపించే ప్రయత్నంలో తెరాసయే ప్రజలు మరియు ప్రతిపక్షాల దృష్టిలో దోషిగా నిలబడే పరిస్థితి చేజేతులా కల్పించుకొన్నట్లయింది. ఇప్పటికే మీడియా పట్ల తీవ్ర అసహనం ప్రదర్శిస్తూ విమర్శలు మూటగట్టుకొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి, తెరాస కార్యకర్తలు చేసిన ఈ నిర్వాకం వలన మరింత చెడ్డపేరు తెచ్చిపెట్టిందనే చెప్పక తప్పదు.

 

అయితే ఈ సమస్య ఇంతటితో ముగిసిపోలేదు. తెదేపా కార్యాలయంపై దాడికి పాల్పడినందుకు నల్గొండ జిల్లా బంద్ కు పిలుపునిచ్చిన తెదేపా నేతలను అరెస్ట్ చేయడంతో ప్రజా సమస్యలపై పోరాడుతున్నప్రతిపక్ష నేతలను తెలంగాణా ప్రభుత్వం అరెస్టులు చేసిందనే అపఖ్యాతి కూడా మూటగట్టుకొన్నట్లయింది.

 

అరెస్టయిన తెదేపా నేతలు ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి, రమణ తదితరులు మీడియాతో మాట్లాడుతూ రైతులకు 8గంటలు ఉచిత విద్యుత్ ఇస్తానని హామీ ఇచ్చిన తెరాస, ఇప్పుడు విద్యుత్ సంక్షోభం పరిష్కరించలేక తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని విమర్శిస్తూ, తెదేపా కార్యాలయాలపై దాడులుకు చేస్తోందని ఎద్దేవా చేసారు. సరిగ్గా ఇటువంటి గడ్డు పరిస్థితులనే ఎదుర్కొన్న ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమస్యను పరిష్కరించుకోగలిగినప్పుడు, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు విఫలమవుతున్నారని మోత్కుపల్లి నరసింహులు ప్రశ్నించారు. తెరాస నేతలు తమ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనేందుకే ఇటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారని తెదేపా నేతలు విమర్శించారు. ఇదంతా గమనిస్తే తెరాస వ్యూహం బెడిసికొట్టినట్లే కనబడుతోంది.

 

ప్రస్తుత విద్యుత్ సంక్షోభం నుండి గట్టెక్కేందుకు తెలంగాణా ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తూ ప్రతిపక్షాల విమర్శలకు మాటలతోనే జవాబు చెప్పి ఉండి ఉంటే, తెలంగాణా ప్రజలు కూడా తెరాస చిత్తశుద్ధిని అనుమానించేవారు కాదు. కానీ ఆ ప్రయత్నం చేయకుండా తెదేపా కార్యాలయంపై దాడి చేయడం ద్వారా ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినట్లయింది. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం 300మెగా వాట్స్ విద్యుత్ సరఫరా చేసేందుకు ముందుకు వచ్చినా దానిని పట్టించుకోకుండా పదేపదే చంద్రబాబు నాయుడుని నిందించడం, తెదేపా కార్యలయలపై దాడులు చేయడం వంటివి ప్రజలకి ప్రభుత్వ సమర్దతపై మరింత అనుమానం రెక్కేత్తించేందుకే దోహదపడతాయి తప్ప ఈ సమస్యకు పరిష్కారం చూపబోవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.