TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కోవూరులో టీఆర్ఎస్ పోటీపై మర్మమేమిటి?

Published on: Tue Feb 28, 2012 9:34AM

హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణవాదాన్ని అటకెక్కిస్తున్నారా...? కోవూరులో పోటీకి సై అనడం వెనుక మర్మమేంటి? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఇప్పట్నుంచే సర్దుబాటు కోసం కోవూరు ఉపఎన్నికను ఎంచుకున్నారా...? లేక సీమాంధ్రలో సమైక్యాంధ్ర సత్తా చాటాలని భావించారా? ఈ సందేహలే ఇపుడు రాష్ట్రంలో చర్చనీయాంశాలుగా మారాయి. తెరాస పుట్టింది తెలంగాణ కోసమేనని చెప్పే కేసీఆర్, ఆది నుంచి సీమాంధ్రలో తమ పార్టీకి చెందిన అభ్యర్థులను పోటీకి దింపిన సందర్భాలు లేవు. కేవలం తెలంగాణా ప్రాంతానికే పరిమితమైన తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రస్తుతం నెల్లూరు జిల్లా కోవూరు ఉపఎన్నికకు సన్నద్ధమైంది.


తెలంగాణలో ప్రస్తుతం ఆరు చోట్ల ఉపఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ సెంటిమెంటుతో ఈ ఎన్నికల్లో తెరాస బరిలోకి దిగుతోంది. అయితే ఇంతకుముందు ఉద్యమ వేడి ఉన్నప్పుడు పరిస్థితులకు నేటి పరిస్థితులకు చాలా తేడా ఉంది. అప్పట్లో తమ అభ్యర్థుల గెలుపు నల్లేరుపై నడకలా సాగింది. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే.. తెరాసతో తెలంగాణ రాదని అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశం తెలంగాణలో విడమర్చి చెపుతున్నాయి. దీంతో ఆ పార్టీలకు తెలంగాణ ప్రాంతంలో కాస్తంత సానుకూల వాతావరణం ఏర్పడినట్లు కనిపిస్తోంది. తెరాసపై ప్రజలకు నమ్మకం పోయిందన్న వాదనలు గట్టిగానే వినబడుతున్నాయి. ఈ క్లిష్ట పరిస్థితులను అధిగమించాలంటే కోవూరులో తమ అభ్యర్థిని నిలబెట్టి.. సమైక్యాంధ్ర సత్తా ఎంతో చూడాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.



కాగా, కోవూరు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బరిలోకి దిగినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బాజిరెడ్డి గోవర్థన్ అన్నారు. సీమాంధ్రలో కూడా తెలంగాణ వాదం విన్పించేందుకు టీఆర్‌ఎస్ పోటీ చేస్తుందని తాము భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.