కేసీఆర్ అసలు రంగు బయటపెడతా! యూసుఫ్
Published on: Sat Feb 25, 2012 8:56AM
హైదరాబాద్: తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ చిట్టా విప్పి, ఆయన అసలు రంగు బయట పెడతానని టీఆర్‌ఎస్ నుంచి బహిష్కరణకు గురైన సయ్యద్ యూసుఫ్ అలీ అన్నారు. ఆయన తెలంగాణకు ఏ విధంగా మోసం చేసింది ప్రజలకు వివరిస్తానన్నారు. మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేయడం కేసీఆర్‌కు వెన్నెతో పెట్టిన విద్య అని శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముస్లిం, దళిత వ్యతిరేకి అయిన కేసీఆర్ కేవలం తన అవసరాల కోసమే ముస్లిం దళిత ఓట్లను వాడుకుంటున్నారని ఆరోపించారు.
గత పార్లమెంట్ ఎన్నికల్లో మహా కూటమి అభ్యర్థిగా తనను జహీరాబాద్ నుంచి పోటీ చేయించి తనను ఆణిముత్యంగా అభివర్ణించిన కేసీఆర్‌కు ఇప్పుడు తాను ఎందుకు పనికిరాకుండా పోయానో చెప్పాలన్నారు. మూడు సంవత్సరాలుగా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడుగా ఉన్న తనకు కనీసం సంజాయిషీ నోటీసు కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ఆపరేషన్ చేయించుకున్న తాను రెండు నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నానని, కనీసం ఒక్కసారి కూడా పలకరించకుండా ఏకంగా తనను సస్పెండ్ చేయడం దారుణమన్నారు. జెండాలు మోసిన వారికి పార్టీలో స్థానం లేదని, టీఆర్‌ఎస్‌ను తిట్టిన గంప గోవర్ధన్‌కు టిక్కెట్ ఇవ్వడం కేసీఆర్ నైజాన్ని బట్టబయలు చేసిందన్నారు.


