TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జేఏసీ భేటీలో కేసీఆర్ వ్యాఖ్యలు!

Published on: Sun Jan 22, 2012 9:07AM

హైదరాబాద్ : "ఎంతసేపూ..జేఏసీ ఉద్యమం చేస్తుంటే.. టీఆర్ఎస్ రాజకీయంగా లబ్ధి పొందుతోంద ని అనటం ఎందుకు? అసలు ఈ ఆలోచనే సరికాదు. జేఏసీ ఉద్యమం చేస్తుంటే.. కాంగ్రెస్-టీడీపీలు లాభపడాలా?'' అని టీ ఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ప్రశ్నించినట్లు తెలిసింది. "ఉద్యమానికి సహకరించేది మేం. ఎన్నికలు వచ్చేసరికి ఇంకోడు గెల్చుడు పద్ధతేనా? దీనిపై జేఏసీలోని వారే ఆలోచించాలి. మేం జేఏసీ కోసం పనిచేస్తున్నప్పుడు.. జేఏసీ కూడా మా కోసం పనిచేయాలి'' అని చెప్పారని సమాచారం. జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం అధ్యక్షతన జరిగిన తెలంగాణ జేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో భాగస్వామ్య పక్షాల ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకా రం "కాంగ్రెస్, టీడీపీలను మనమెందుకు నిందించాలి? తెలంగాణ కోసం మన ఉద్యమం ఏదో మనం చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది కదా?'' అని జేఏసీ జిల్లా నేత ఒకరు అన్నప్పుడు, కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. "కాంగ్రెస్, టీడీపీలను రాజకీయం గా అంతం చేయకుండా, తెలంగాణ ఎలా వస్తుంది? అని ప్రశ్నించారు.మనం సొంతంగా 70-80 అసెంబ్లీ స్థానాలను గెలిస్తేనే, ఆ రెండు పార్టీల వాళ్లు భయపడతారు.  ఈ ప్రాంతంలో మిగిలిన పార్టీలకు చోటు లేకుండా చేయాలి. ఇదే జేఏసీ అంతర్గత ఎజెండాగా ఉండాలి'' అని స్పష్టం చేసినట్లు సమాచారం. 2014 ఎన్నికలు లక్ష్యంగా జేఏసీలోని పక్షాలను రాజకీయంగా బలోపేతం చేసే విధంగా జేఏసీ కార్యాచరణ ఉండాలని కేసీఆర్ సూచించారు.

"ఉద్యమ పంథా విజయవంతానికి రాజకీయ అస్తిత్వం తప్పనిసరి. జేఏసీలో ఉండటమంటే రాజకీయంగా నష్టపోవటం కాదు. రాజకీయంగా నష్టపోయే పనికైతే మేం జేఏసీలో ఉండటం ఎందుకు?'' అని ప్రశ్నించారు. "మనలో మనం కొట్లాడుతూ పోతుంటే.. వాళ్లు  రాజకీయంగా బలపడుతున్నారు. అలాంటి దానికి జేఏసీ ఎందుకు?  కాంగ్రెస్‌కో ఖతంకరో.. తెలంగాణకో హాసిల్‌కరో అన్న నినాదంలో టీడీపీనీ చేర్చాలి.తెలంగాణలో టీడీపీ యాత్రలకు కాంగ్రెస్ సహకరించింది. చంద్రబాబు యాత్ర సక్సెస్ అయ్యేలా చేసింది. వాళ్లంతా ఒకటే. మనం ఒకటి కాకపోతే వారు అణగదొక్కుతారు'' అని చెప్పారు.ఈ క్రమంలో జేఏసీ ప్రతినిధుల్లో ఒకరు ఇప్పుడు 2014 ఎన్నికల ప్రస్తావన ఎందుకని, రాజకీయాలు కాకుండా ఉద్యమంపై మాట్లాడితే బాగుంటుందనటంతో కేసీఆర్ ఘాటుగా బదులిచ్చారు. "రాజకీయ పార్టీగా ఉన్నప్పుడు రాజకీయాలు కాకపోతే ఏం మాట్లాడతాం. బాజాప్తా రాజకీయాలే మాట్లాడుతాం'' అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ భేటీ ముగియకుండానే వివరాలు మీడియాకు పొక్కటంపైనా చర్చ జరిగింది.

 ఇకపై జేఏసీ సమావేశాలకు సెల్‌ఫోన్లు బయటపెట్టి వస్తే ఎలా ఉంటుందనే అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. సమావేశంలో బీజేపీ ప్రతినిధి అశోక్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ, రాజకీయంగా తమ పార్టీ అస్తిత్వాన్ని పెంచుకుంటూనే, తెలంగాణ కోసం పోరాడుతామని, జేఏసీలో భాగంగానే ఉంటామన్నారు. రాబోయే ఉప ఎన్నికలపై జేఏసీ భాగస్వామ్య పార్టీలు మరోసారి ప్రత్యేకంగా భేటీ కావాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.ఉద్యమంలో భాగంగా తెలంగాణను అడ్డుకుంటున్న సీమాం ధ్ర శక్తుల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలన్న కొందరు జేఏసీ ముఖ్యుల అభిప్రాయంతోనూ కేసీఆర్ విభేదించారు. "వారి ఆర్థిక మూలాలను దెబ్బతీయటం ఎలా సాధ్యమవుతుంది? వాళ్లు ఉత్పత్తి చేసే వస్తువులను కొనవద్దని పిలుపునిస్తే సక్సెస్ అవుతామా? సినిమాలు చూడవద్దని అంటే ఎవరు వింటారు? ఆయా రంగాల్లోకి మనం ఎలా చొచ్చుకెళ్లాలనేదే ఆలోచించాలి. అంతేకాని వారి ఆర్థిక మూలాలను దెబ్బతీయటం అయ్యే పనికాదు'' అని టీఆర్ఎస్ చీఫ్ తేల్చిచెప్పారు.