జగన్ పట్ల కేసీఆర్‌కు ఆంతర్యమేమిటి ?: విహెచ్ ప్రశ్న
Published on: Mon Jan 9, 2012 12:00PM
హైద
రాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్ మధ్య ఉన్న రహస్య లింకేమిటని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ప్రశ్నించారు. ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ చంద్రబాబు తెలంగాణ పర్యటనను అడ్డుకోవడానికి వారం రోజుల ముందు నుంచే కసరత్తు చేసిన కేసీఆర్ ఈనెల పదో తేదీన నిజామాబాద్ జిల్లాలో ఆర్మూలో చేపట్టనున్న జగన్ దీక్ష పట్ల ఆయన మెతక వైఖరిని అవలంభించడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.నిజామాబాద్ వస్తే అడ్డుకుంటామన్న జెఏసి ప్రకటన చూశాం కాని కేసీఆర్ స్టేట్‌మెంట్ మాత్రం ఎక్కడా చూడలేదన్నారు. గతంలో తెలంగాణ వ్యతిరేకి అని జగన్ పైన రాళ్లు వేయించిన తెరాస నేతలు ఇపుడు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
అసలు జగన్‌లో ఎలాంటి మార్పు కనిపిస్తుందో కేసీఆర్ ప్రజలకు చెప్పాలని వీహెచ్ డిమాండ్ చేశారు. జగన్ యాత్ర సందర్భంగా కెసిఆర్ ఏం చేస్తాడో కోదండరాంరెడ్డి ఏం చేస్తాడో చూడాలన్నారు.వరంగల్‌లో చంద్రబాబుకు ప్రధాని స్థాయిలో సెక్యూరిటి ఇచ్చారని ప్రభుత్వాన్ని విమర్శించారు. బాబుకు రక్షణ కల్పించినట్లుగా మేం రాయలసీమకు వెళితే కల్పిస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాబు పర్యటన అడ్డుకోవడం సరికాదని, దేశంలో ఎవరికైనా ఎక్కడైనా పర్యటించే హక్కు ఉందన్నారు.మద్యం సిండికేట్లలో అన్ని పార్టీల హస్తం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు, ముఖ్యమంత్రి కిరణ్ కుమ్మక్కయ్యారన్న అంశాన్ని అధిష్టానం చూసుకుంటుందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.


