ఓట్లు,నోట్లు,సీట్ల కోసమే కెసిఆర్ : మోత్కుపల్లి
Published on: Sun Jan 8, 2012 3:25PM
హై
దరాబాద్: అమరవీరులను అడ్డు పెట్టుకొని టిఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కోట్లు దండుకున్నారని, కెసిఆర్ ను కోర్టుకు ఈడ్చుదాం రండి అంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణ కోసం మృతి చెందిన అమరవీరుల కుటుంబాలకు విజ్ఞప్తి చేశారు.ఓట్లు, నోట్లు, సీట్ల కోసమే కెసిఆర్ ప్రయత్నాలు అన్నీ అయన విమర్శించారు. ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని కెసిఆర్ ఎన్నో ఒప్పందాలు కుదుర్చుకున్నారన్నారు.అమరవీరుల పేరుతో అక్రమ సంపాదనకు రుచి మరిగాడని, విద్యార్థుల రక్తం తాగి కెసిఆర్ ఫామ్ హౌస్‌లో నిషాలో ఉన్నారని విమర్శించారు. అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదించిన కెసిఆర్‌ను జైలుకు పంపేదాకా నిద్రపోమన్నారు. 2001లో ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి కెసిఆర్‌కు వచ్చిందని, ఇప్పుడు ఆయన వద్ద యాభై వేల కోట్ల రూపాయలు ఎక్కడివో తెలువాల్సి ఉందన్నారు. ఆయన వద్ద ఉన్న ఆస్తులను అమరవీరులకు పంచాలని డిమాండ్ చేశారు. లేదంటే కోర్టుకు వెళతామన్నారు. అమరవీరుల కుటుంబాలని టిడిపి ఆదుకుంటుందని చెప్పారు. మృతిచెందిన అమరవీరుల కుటుంబాలలో ఒక్క కుటుంబాన్నైనా కెసిఆర్ పరామర్శించారా అని ప్రశ్నించారు. కెసిఆర్ పెత్తందారీ వ్యవస్థను కొనసాగనివ్వమన్నారు. ఉప ఎన్నికల కోసమే సంక్రాంతి తర్వాత, ఫిబ్రవరిలో ఉద్యమం, దీక్షలు చేస్తానని కెసిఆర్ ప్రకటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.


