'ఎవడబ్బ సొత్తు' అంటూ కేసీఆర్ ని ప్రశ్నించిన జగన్.. వీడియో వైరల్

 

జూన్ 21న తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఏపీ సీఎం వైఎస్ జగన్‌‌లను కేసీఆర్ ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే ముంబై వెళ్లి ఫడ్నవీస్‌ను ఆహ్వానించిన కేసీఆర్.. జూన్ 17న అమరావతి వెళ్లి జగన్‌ను ఆహ్వానించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి పేచీలు పెట్టకుండా సహకరించినందున ఫడ్నవీస్‌ను, సాటి తెలుగు రాష్ట్ర సీఎం అయిన జగన్‌ను కేసీఆర్ చీఫ్ గెస్టు‌లుగా పిలుస్తున్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథి జగన్ అని వార్తలు రాగానే సోషల్ మీడియా వేదికగా జగన్ మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2016లో కాళేశ్వం ప్రాజెక్ట్ శంకుస్థాపనకు వ్యతిరేకంగా జగన్ మూడు రోజులపాటు కర్నూలులో జలదీక్ష చేపట్టారని, 2019లో అదే ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎలా వెళ్తారని ప్రశ్నిస్తున్నారు. 

2016 మే 2న కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు కేసీఆర్ శంకుస్థాపన చేశారు. కాగా, తెలంగాణ రాష్ట్రం అక్రమంగా ప్రాజెక్టులను నిర్మించడాన్ని నిరసిస్తూ.. అదే ఏడాది మే 16, 17, 18 తేదీల్లో వైఎస్ జగన్ కర్నూలులో జలదీక్ష పేరిట మూడు రోజులపాటు నిరహార దీక్ష చేపట్టారు. అంతేకాదు ఆ దీక్ష సమయంలో జగన్ కేసీఆర్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘తెలంగాణ ప్రాజెక్టుల వల్ల ఏపీ, తెలంగాణ.. ఇండియా, పాకిస్థాన్ అయిపోదా? తాగడానికి నీళ్లు లేకపోతే బతికేదెలా? భుపాలపల్లి థర్మల్ ప్రాజెక్ట్‌తో కలిపి గోదావరి జలాల ట్రిబ్యూనల్ గతంలో ఏపీకి 1480 టీఎంసీలను కేటాయించింది. ఇందులో నా భాగం 950 టీఎంసీలు, మిగతా 530 టీఎంసీలు మీవని కేసీఆర్ అంటున్నారు. నేను అడుగుతున్నా కేసీఆర్‌ను.. ఎవడబ్బ సొత్తు ఇది అని అడుగుతున్నా? ఆయన ఇష్టం వచ్చినట్టుగా ప్రాజెక్టులు కడుతున్నారు. ఇరు రాష్ట్రాల నీటి వాటా ఎంత అనేది కృష్ణా, గోదావరి నదుల్లో తేలలేదు. కేవలం మీది ఎగువ రాష్ట్రం కాబట్టి.. మీ అవసరాలు తీరాకే మాకు నీళ్లు పంపిస్తామని హిట్లర్‌లా మాట్లాడటం కేసీఆర్‌కు భావ్యం కాదు.’’ అని జగన్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియో షేర్ చేసి.. మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పే జగన్ ఇప్పుడెలా మాట తప్పుతున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు జగన్ మీద ట్రోల్ల్స్ చేస్తున్నారు.