బీజేపీలో వ్యాక్సిన్ సెగ! దిద్దుబాటు చర్యల్లో మోడీ, షా

ఉచిత కరోనా వ్యాక్సిన్  హామీ కమలంలో కలకలం రేపుతుందా? బీహార్ ఎన్నికల మేనిఫెస్టో పై బీజేపీలోనే విభేదాలొస్తున్నాయా?. అంటే అవుననే చెప్పాల్సి వస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో  కరోనా వ్యాక్సిన్ ను వాడుకోవడంపై బీజేపీలోని కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. బీహార్ ఎన్నికల్లో ఓట్ల కోసం ఇచ్చిన ఉచిత కరోనా వ్యాక్సిన్ హామీతో  ఇతర రాష్ట్రాల్లో బీజేపీకి ఇబ్బంది వస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఇది విపక్షాలకు వరంగా మారిందని కొందరు కమలనాధులుచెబుతున్నారు. బీహార్ నేతల తీరు, మేనిఫెస్టో కూర్పుపై వారు మండిపడుతున్నారని సమాచారం. 

 

ఫ్రీ కరోనా వ్యాక్సిన్ హామీ తో తమకు డ్యామేజీ కల్గిందని బీజేపీ పెద్దలు గుర్తించినట్లు కనిపిస్తోంది. నరేంద్ర మోడీ సర్కార్ దిద్దుబాటు చర్యలకు కూడా దిగింది. దేశ ప్రజలందరికీ ఉచిత కరోనా వ్యాక్సిన్ ను ఇస్తామని కేంద్ర మంత్రి ప్రతాప్ సారంగి చెప్పారు. ప్రజలందరికీ వ్యాక్సిన్ ను ఉచితంగా అందిస్తామని ప్రధాని మోడీ ప్రకటించారని తెలిపారు. ఒక్కో వ్యాక్సిన్ కు రూ. 500 వరకు ఖర్చవుతుందని... ఈ మొత్తాన్ని కేంద్రమే భరిస్తుందని చెప్పారు. కరోనా వ్యాక్సిన్ పై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని సారంగి ఆరోపించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం కరోనాను వాడుకోవాల్సిన అవరసం తమకు లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. 

 

దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా ఉంది. కరోనా బాధితుల సంఖ్య 80 లక్షలకు చేరింది. అయితే గత నెల రోజులతో పోలిస్తే.. ప్రస్తుతం రోజువారి కేసుల సంఖ్య కాస్త తగ్గింది. అయినా జనాల్లో మాత్రం వైరస్ భయం పోలేదు. ఇప్పటికి చాలా కంపెనీలు తమ ఉద్యోగులతో వర్క్ ఫ్రమ్ హోం చేపిస్తున్నాయి. వ్యాక్సిన్ వచ్చేవరకు  ఈ పరిస్థితి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశ ప్రజలంతా  కరోనా నివారణ టీకా ఎప్పుడొస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రజా జీవితంలో కరోనా వ్యాక్సిన్ ఇప్పుడు అత్యంత కీలక అంశంగా మారింది. ఇలాంటి తరుణంలో కరోనా వ్యాక్సిన్ పై బీజేపీ చేసిన ప్రకటన ఇప్పుడా పార్టీని ఇబ్బందుల్లో పడేసినట్లు భావిస్తున్నారు. 

 

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కరోనా వ్యాక్సిన్ ను బీజేపీ తన మేనిఫెస్టోలో చేర్చడం దుమారం రేపుతోంది. కరోనా వ్యాక్సిన్  హామీ ఇచ్చిన బీజేపీపై దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామని బీజేపీ చెప్పడంపై.. విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఇతర రాష్ట్రాల ప్రజలు ఏం పాపం చేశారని ప్రశ్నిస్తున్నాయి, ఎన్నికలు ఉంటే తప్ప ప్రజలకు ఏమీ చేయరా? అంటూ విరుచుకుపడుతున్నారు ప్రతిపక్షాల నేతలు. కరోనా మహమ్మారిని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని దుయ్యబడుతున్నారు. ఇతర రాష్ట్రాల ప్రజలు బంగ్లాదేశ్ నుంచి వచ్చారా? అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నిలదీశారు. 

 

కరోనా వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందన్న దానిపై ఆరోగ్య సంస్థల దగ్గర క్లారిటీ లేదు. ప్రపంచ వ్యాప్తంగా టీకా కోసం ముమ్మరంగా పరిశోధనలు జరుగుతున్నా.. వ్యాక్సిన్ కచ్చితంగా ఎప్పుడు వస్తుందన్న దానిపై క్లారిటీగా చెప్పడం లేదు. మరోవైపు కొన్ని సంస్థలు మాత్రం రెండేళ్ల వరకు వ్యాక్సిన్ రాకపోవచ్చని చెబుతున్నాయి. మనదేశంలోని ప్రతిష్టాత్మక సంస్థ అయిన సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఐసీఎంఆర్ కూడా వ్యాక్సిన్ పై పూర్తి క్లారిటీ ఇవ్వడం లేదు. వ్యాక్సిన్ పై ఫార్మా సంస్థలకే క్లారిటీ లేని సమయంలో వ్యాక్సిన్ ను అందరికి ఉచితంగా ఇస్తామని చెప్పడం తీవ్ర విమర్శల పాలైంది. కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కమలనాధులను కడిగి పారేస్తున్నారు. 

 

మొత్తం బీహార్ అసెంబ్లీ మేనిఫెస్టోలో ఫ్రీ కరోనా వ్యాక్సిన్ హామీ ఇచ్చిన బీజేపీ.. జనాల్లో చులకన అయ్యిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కొందరు నేతల అత్యాత్సాహం వల్లే తాము ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చిందని బీజేపీలోనూ చర్చ జరుగుతుందట. వ్యాక్సిన్ హామీతో విపక్షాలకు అనవసరంగా అస్త్రం ఇచ్చినట్లైందని కొందరు కమలనాధులు ఆఫ్ ది రికార్డుగా మాట్లాడుతున్నారని చెబుతున్నారు.