పెటా దెబ్బకి... పెంటైపోయిన త్రిష పరిస్థితి!

 

సోషల్ మీడియా దెబ్బకి ప్రపంచం నానా రకాలుగా మారిపోతోంది. ఒకప్పుడు మన మాట ప్రపంచం వినాలంటే పేపర్లు, టీవీలు అవసరం అయ్యేవి. కాని ఇప్పుడు సోషల్ మీడియా ఎరాలో అంతా ఫేస్బుక్, ట్విట్టర్ మయం! మనసుకు ఏది తోచినా క్షణాల్లో నెట్ లోకి నెట్టేయొచ్చు. ఆ తరువాత అది మనమే స్వయంగా ఆపాలనుకున్నా ఆగదు. ఒకరి నుంచి ఒకరు షేర్ లు చేస్తూ ఎక్కడెక్కడికో పాకించేస్తుంటారు. కాని, ఇదంతా పాజిటివ్ యాంగిల్. సోషల్ మీడియా విచ్చలవిడితనానికి నెగటివ్ కోణం కూడా వుంది. పాపం, ఇప్పుడు దానికే చాలా మంది సెలబ్రిటీల మాదిరిగానే త్రిష బలైపోయింది...

 

త్రిష అంటే పడి చచ్చిపోయే అభిమానులు బోలెడు మంది. కాకపోతే, ఆమెకు తాజాగా మరో విషయం తెలిసింది. జల్లికట్టు ఆటకు ఆమెకున్న అభిమానుల కంటే ఎక్కువ మంది అభిమానులు వున్నారు తమిళనాడులో. వారు తమ అభిమాన ఆట కోసం ఎంతగా పడి ఛస్తారంటే .. అవసరమైతే త్రిషని చంపేయటానికి రెడీ అయిపోతారు! అయితే, ఆగండాగండీ... మరీ భయపడాల్సింది ఏమీ లేదు కాని... ఉరుము ఉరిమి మంగళం మీద పడిందన్నట్టు జల్లికట్టు జగడం ఇప్పుడు త్రిషకు చుట్టుకుంది. అందుకే, ఆమె ట్విట్టర్ లో తెగ సీరియస్ అయిపోయారు!

 

త్రిషకి, జల్లికట్టుకి మామూలుగా అయితే ఎలాంటి సంబంధం లేదు. కాని, కొందరు హార్డ్ కోర్ తమిళ జల్లికట్టు అభిమానులు ఒక లింక్ కనిపెట్టారు. అదే పెటా! జంతు సంరక్షణ కోసం కృషి చేసే పెటా సంస్థ త్రిషని తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఎప్పట్నుంచో కొనసాగిస్తోంది. త్రిష కూడా వీధి కుక్కల్ని హింసించకండి లాంటి పిలుపులిస్తూ కూల్ గానే బండి నెట్టుకొస్తోంది. కాని, జల్లికట్టు నిషేధించాలని పెటా వారు సుప్రీమ్ కి వెళ్లటంతో త్రిషకి పెద్ద ఇబ్బంది వచ్చి పడింది. తమ సంప్రదాయ క్రీడను అడ్డుకున్న సంస్థతో త్రిషకి సంబంధాలు వుండటం తమిళులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే, ఆమెకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తున్నారు. అంతటితో ఊరుకోకుండా బూతులు కూడా తిట్టేస్తున్నారు. పనిలో పనిగా కొందరైతే త్రిష చచ్ఛిపోయిందని ప్రచారం చేస్తూ ఫోటోలు పెడుతున్నారు. ఇవన్నీ వారు జల్లికట్టు మీద తమకున్న అభిమానంతోనే చేస్తున్నారు. కాకపోతే, పెటా పిటీషన్ కి, సుప్రీమ్ తీర్పుకి ఏ సంబంధం లేని త్రిష మాత్రం సెగ భరించాల్సి వస్తోంది...

 

తనపై జరుగుతోన్న దుర్మార్గ ప్రచారానికి స్పందించిన త్రిష ట్విట్టర్లో స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. ఆడవాళ్లని, వాళ్ల కుటుంబాల్ని టార్గెట్ చేయటమే తమిళ సంస్కృతా అంటూ ఘాటుగా ప్రశ్నించింది. తాను జల్లికట్టుకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆమె చెప్పింది. అయినా కావాలని ఫ్రీగా దొరికిన సోషల్ మీడియా సైట్స్ లో నోటికి వచ్చిందల్లా వాగుతున్నారని తిట్టిపోసింది!

 

పాపం త్రిష... పెటా వారు చేసిన తప్పుకి దురభిమానుల పెంట మాటలన్నీ భరించాల్సి వస్తోంది! గ్లామర్ వుండీ సెలబ్రిటీగా కొనసాగినప్పుడు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు మరి...