ట్రిపుల్ తలాక్‌కు "సుప్రీం" తలాక్..!

14 వందల సంవత్సరాలుగా మతాచారాల పేరు చెప్పి మహిళల జీవితాలను దుర్భరం చేస్తోన్న ట్రిపుల్ తలాక్‌పై సర్వోన్నత న్యాయస్థానం సంచలనం తీర్పు వెలువరించింది. ముమ్మారు తలాక్‌పై పార్లమెంట్‌లో చట్టం తీసుకురావాలని కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటి వరకు ట్రిపుల్ తలాక్ చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. మనదేశంలో విడాకులు తీసుకోవాలంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిందే. కానీ ముస్లిం మతాచారాల ప్రకారం ఒక వ్యక్తి తన భార్యకు విడాకులు ఇవ్వాలంటే తలాక్..తలాక్..తలాక్ అని మూడు సార్లు చెప్పినట్లయితే వారి వివాహబంధం తెగిపోయినట్లే..అయితే దానిని అమలు చేయడానికి పవిత్ర ఖురాన్ గ్రంథంలో కఠిన నియమాలు, షరతులు ఉన్నాయి. కాని వాటిని పట్టించుకోకుండా..ఫోన్, మేసేజ్, వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా చాలా మంది తమ భార్యలకు తలాక్ చెప్పేసి భార్యలను నడి సంద్రంలో విడిచిపెడుతుండటంతో అనేకమంది ముస్లిం మహిళలు, వారి పిల్లల భవిష్యత్ అంధకారంగా మారుతోంది.

 

సౌదీ అరేబియా, కువైట్ ఆఖరికి మన పక్కనే ఉన్న పాకిస్థాన్‌ సైతం ఏనాడో ట్రిపుల్ తలాక్‌ను తమ దేశాల్లో నిషేధించాయి. కానీ భారత్‌లో మాత్రం ట్రిపుల్ తలాక్ అనేది మత విశ్వాసంలా చెలామణీలో ఉంది. ఈ సమస్య నానాటికీ తీవ్రతరం అవుతున్నా..ఎంతోమంది జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నా ముస్లిం మత పెద్దలు కానీ..ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు గానీ సమస్య పరిష్కారానికి పూనుకున్న పాపాన పోలేదు. దీంతో తమ రేపటి తరాల భవిష్యత్‌ కోసం నడుం బిగించింది. ట్రిపుల్ తలాక్ న్యాయబద్ధం కాదని..దాని వల్ల తాము, తమ బిడ్డలు జీవితాలను కోల్పోతున్నామని అత్యున్నత న్యాయస్థానానికి మొరపెట్టుకున్నారు. ఈ పిటిషన్లను అందుకున్న సుప్రీం వెనువెంటనే చర్యలకు ఉపక్రమించింది.

 

కానీ మార్చి 28న జరిగిన విచారణ సందర్భంగా భారత రాజ్యాంగంలోని సెక్షన్ 25 ప్రకారం భారత ప్రభుత్వానికి గానీ న్యాయస్థానాలకు గానీ ముస్లిం మతాచారాలలో కలగజేసుకునే అధికారం లేదని..ఇది అల్లాను, ఖురాన్‌ను అవమానించినట్లే అవుతుందని ముస్లిం పర్సనల్ లా బోర్డు తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆ వాదనలతో ఏకీభవించని సర్వోన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. అయితే తాము ట్రిపుల్ తలాక్‌ను గానీ..రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ను గానీ ఉల్లంఘించడం లేదంటూ తుది తీర్పు సందర్భంగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహార్ వ్యాఖ్యానించారు.

 

మహిళల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా తలాక్ విధానం ఉందని..ఇన్‌స్టంట్‌గా మూడు సార్లు తలాక్ చెప్పడం ద్వారా భార్యను వదిలించుకోవాలని చూడటం అత్యంత హేయమైన చర్యని..ఈ విధానాన్ని తొలగించేలా చట్టం చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. పార్లమెంటులో చట్టం చేసేందుకు వీలుగా ఆరు నెలలు గడువు ఇస్తున్నామని..ఈ కాలంలో ట్రిపుల్ తలాక్‌‌పై స్టే విధిస్తున్నట్లు తెలిపింది. కొత్త చట్టం తెచ్చేటప్పుడు ముస్లిం లా బోర్డు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రప్రభుత్వానికి సుప్రీం సూచించింది. ఇప్పటికే తాము ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకమని కేంద్రం చెప్పడంతో..ఇప్పుడిక పార్లమెంటులో చట్టం జరగడం ఇక లాంఛనమే. ఎందుకంటే ఇటు లోక్‌సభలో కానీ..అటు రాజ్యసభలో కానీ ఎన్డీఏకు పూర్తి స్థాయి మెజారిటీ ఉంది గనుక, ట్రిపుల్ తలాక్‌కి చట్టం తీసుకొస్తే..చాలా సులభంగానే ఆమోదం పొందుతుంది.