TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తలాక్‌ ఇక మీదట చెల్లదా!

Published on: Thu Mar 31, 2016 3:30PM

 

ఇప్పటివరకు భారతదేశంలోని ముస్లింల మత చట్టాలలో ప్రభుత్వం ఎలాంటి జోక్యమూ కలిగించుకోలేదు. అయితే ప్రభుత్వం నియమించిన ఒక కమిటీ సూచనలను కనుక ఆమోదిస్తే, దేశంలో మరో వివాదం రాజుకునే అవకాశం ఉంది. ఈ కమిటీ బహుభార్యత్వం మీదా, మూడుసార్లు తలాక్‌ చెప్పే విధానం మీదా తన అభ్యంతరాలను తెలియచేసినట్లు వినికిడి. ముస్లిం మహిళలు విడాకులు తీసుకున్న తరువాత, వారికి తగినంత భరణాన్ని చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కూడా కమిటీ పేర్కొన్నట్లు సమాచారం. ఈ భరణానికి సంబంధించి ఇప్పటికే 1985 నాటి షాబానో కేసులో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించినా, ఆ తీర్పుకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. అప్పటి నుంచి న్యాయస్థానాలు కానీ, ప్రభుత్వం కానీ ముస్లిం మత చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించేందుకు సాహసించలేదు.

 

అయితే మూడుసార్లు తలాక్‌ చెప్పి విడాకులు తీసుకునే విధానం మీద, ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలియచేయాలని నిన్న సుప్రీం కోర్టు ఆదేశించడంతో, ప్రభుత్వం తన నిర్ణయాన్ని తెలియచేయాల్సిన అగత్యం వచ్చింది. ఉత్తరాఖండ్‌కు చెందిన సైరాబాను అనే మహిళకు సంబంధించిన కేసులో సుప్రీం ఈ ఆదేశాలను జారీచేసింది. సైరాబాను వాదన ప్రకారం మూడుసార్లు తలాక్‌ చెప్పే విధానం గురించి ఖురాన్‌లో తగిన ప్రస్తావన లేదని, పాకిస్తాన్‌ వంటి చాలా ఇస్లామిక్‌ దేశాలు సైతం ఈ విధానాన్ని అనుమతించడం లేదనీ తెలుస్తోంది. మరి కేంద్రం ఈ విషయంలో తన నిర్ణయాన్ని ఎలా తెలియచేస్తుందో చూడాలి. తాను నియమించిన కమిటీ మాటలతో ఏకీభవిస్తూ, అదే విషయాన్ని సుప్రీంకు చేరవేస్తుందా. లేకపోతే మతపరమైన సున్నిత అంశాల జోలికి పోకుండా తటస్థంగా ఉండిపోతుందా అన్నది త్వరలోనే తేలనుంది!