TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బాక్సైట్ పై ఆదివాసీల పోరు

Published on: Mon Mar 19, 2012 2:39PM

వివాదాస్పద బాక్సైట్ గనుల తవ్వకాలకు వ్యతిరేకంగా ఆదివాసీలు పోరు ప్రారంభించారు. తూర్పుగోదావరి, విశాఖ మన్యం ప్రాంతాల్లో అపారంగా ఉన్న ఈ బాక్సైట్ గనులను తవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఇదే జరిగితే తమ జీవనోపాధి దెబ్బతింటుందని పర్యావరణం కలుషితమైపోతుందని ఆదివాసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివాసీల వెనుక అనేక సామాజిక, పర్యావరణ పరిరక్షణ సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల సహకారంతో ఆదివాసీలు ఎక్కడికక్కడ బాక్సైట్ గనుల సర్వే పనులను అడ్డుకుంటున్నారు. అరకులోయ, అనంతగిరి, చింతపల్లి, గుర్తేడు కొండల్లో బాక్సైట్ తవ్వకాలవల్ల గోస్తనీ, శారద, సీలేరు, శబరి, మార్చ్ ఖండ్, ఏలేరు నదులకు ముప్పు ఉంటుందని ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నదీ జలాలతో పండే భూములన్నీ బీడువారనున్నాయని, గోస్తనీ, శారద నదులపై నిర్మించిన తాటిపూడి, రైవాడ, జలాశయాలకు నీటి వనరులు తగ్గిపోవడమేకాక బాక్సైట్ వ్యర్థాలతో కలుషితమవుతాయని వారంటున్నారు. ఫలితంగా విశాఖతోపాటు ఉభయ గోదావరి జిల్లాలకు తాగు, సాగు నీటి సమస్య వస్తుందన్నారు. శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం, రణస్థలం, చిలకపాలెం, విశాఖజిల్లా భీమునిపట్నం, పరవాడ, నక్కపల్లి, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, కృష్ణాజిల్లా కొండపల్లిలో ఏర్పాటు చేసిన రసాయన, క్రిమిసంహారక పరిశ్రమలు, బల్క్ డ్రగ్ యూనిట్లవల్ల అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు వస్తాయని వారంటున్నారు. ఇసుక రాతినేలలున్న కృష్ణా, గోదావరి డెల్టాల్లో జరుపుతున్న ఆయిల్ డ్రిల్లింగ్ కార్యకలాపాల వల్ల భూములు కుంగిపోతున్నాయన్నారు.