గిరిజనుల గోడు పట్టదా? జగన్‌రెడ్డి కనికరించరా?
Published on: Fri Nov 12, 2021 11:56AM
వాళ్లంతా గిరిజనులు. అడవి బిడ్డలు. అందుకే కాబోలు వారంటే అంత అలుసు. దశాబ్దాలుగా కష్టాలు పడుతున్నా.. కనికరించే పాలకుడే లేకుండాపోయాడు. ప్రభుత్వాలు మారినా.. పార్టీలు మారినా.. వారి కష్టాలు మాత్రం మారడం లేదు. వారి గోడు వినేవాడు లేడు.
అరటి ఆకులు కట్టుకొని.. నదిలో నిలుచొని.. నిరసన తెలుపుతున్న వీరంతా విజయనగరం జిల్లా గిరిజనులు. వాళ్లు ఇలా నిరసన తెలుపుతున్నది నదిపై వంతన కోసం. ఇదేమీ ఇప్పటికిప్పుడు వచ్చిన డిమాండ్ కానే కాదు. కొమరాడ మండలం పూర్ణపాడు-లాబేసు మధ్య నాగావళి నదిలో వంతెన నిర్మాణానికి 2006లోనే శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అయితే చేశారు కానీ.. నేటికీ పనులు ప్రారంభించలేదు. ఒక్క ఇటుకైనా వేయలేదు. అందుకే.. నాగావళి నదిలో.. ఒంటికి అరటిఆకులు కట్టుకొని.. ఇలా నిరసన తెలిపారు.
నదికి ఆవల 33 గ్రామాలున్నాయి. ఆ గ్రామస్తులంతా జస్ట్ 4 కిలోమీటర్ల దూరంలోని కొమరాడ మండల కేంద్రానికి చేరుకోవాలంటే.. చుట్టూ తిరిగి.. 40 కి.మీ ప్రయాణించాల్సి ఉంటుంది. అదే, నదిపై వంతెన కడితే.. 40 కి.మీ. దూరం.. 4 కి.మీ.లకు తగ్గుతుంది. అందుకే, తమ కష్టాలు ప్రభుత్వానికి తెలిసేలా.. వ్యవసాయ కార్మిక, గిరిజన సంఘాల నాయకులు అరటి ఆకులు కట్టుకొని వినూత్న నిరసన తెలిపారు. మరి, పాలకుల కంటికి వీరి కష్టాలు కనిపిస్తాయా? గిరిజనుల గోడు జగన్‌రెడ్డికి చెవికి చేరేనా?


