గిరిజనులకీ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి: బాలరాజు

 

గిరిజన సంక్షేమ శాఖామంత్రి బాలరాజు నిన్న శాసనసభలో మాట్లాడుతూ, తాను రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం తీసుకొన్న నిర్ణయాన్ని సమర్దిస్తున్నానని అన్నారు. తమ పార్టీ రాష్ట్రంలో అన్ని పార్టీలను సంప్రదించిన తరువాతనే విభజనకు పూనుకొందని, కానీ పార్టీలన్నీ మాట తప్పి కాంగ్రెస్ ను ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని చూస్తున్నాయని విమర్శించారు.

 

వెనుకబాటుతనం, ఆత్మగౌరవం పేరిట మొదలయిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు, ఇప్పుడు అధికారం కోసం ఆదిపత్య పోరులో మునిగి తేలుతున్నాయని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా తన పాడేరు నియోజక వర్గంలో గిరిజనులు పడుతున్న అష్టకష్టాల గురించి వివరించి, రాష్ట్ర విభజన అనివార్యమయితే దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని గిరిజనుల కోసం ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేసారు. బాలరాజు ఏ కారణంగా తెలంగాణా ఉద్యమాలు మొదలయ్యాయో చెప్పి, వాటిని విమర్శించడమే గాక మళ్ళీ ఆయన అవే కారణాలతో గిరిజనులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేయడం విచిత్రం.

 

గిరిజనుల కష్టాల గురించి, వారికి ఏర్పాటు చేయవలసిన సౌకర్యాల గురించి సభలో ధాటిగా ప్రసంగించిన బాలరాజు, గిరిజన సంక్షేమ శాఖామంత్రిగా వారికోసం ఏమి చేసారో తెలియదు కానీ, పాడేరు పాత ఐటిడిఎ కార్యాలయ స్థలాన్ని, చింతపల్లి ఎలక్ట్రిక్ బోర్డు స్థలాన్ని, గూడెంలోని కాఫీబోర్డు స్థలాన్నికబ్జా చేశారని, ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 300 ఎకరాల భూములపై కన్నువేశారనే ఆరోపణలున్నాయి. ఆయన భూకబ్జాలపై మాజీ ఎమ్మెల్యే గొడ్డేటి దేముడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదులు పంపారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బాలరాజు గిరిజనుల సంక్షేమాన్ని విస్మరించి తన సంక్షేమాన్ని మాత్రమే చూసుకుంటున్నారని దేముడు విమర్శిస్తున్నారు.

 

మంత్రి బాలరాజు భూకబ్జాలకు పాల్పడటమే కాకుండా అనేక అనైతిక పనులు కూడా చేస్తున్నారని, అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని దేముడు తన ఆరోపణలో పేర్కొన్నారు. తన ఆటలు సాగవనే ఉద్దేశ్యంతో పాడేరు ఐటిడిఎ కార్యాలయానికి ఐఎఎస్ అధికారిని నియమించకుండా బాలరాజు అడ్డుకుంటున్నారని సబ్ కలెక్టర్ కార్తికేయ మిశ్రాను అడ్డుతొలగించి ఆయన స్థానంలో తనకు అనుకూలమైన ఆర్డీవో స్థాయి అధికారిని నియమించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని దేముడు ఆరోపించారు.

 

బాలరాజు మంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన కొద్ది నెలలకే ఆయనపై ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు, ఆయన ఇప్పుడు గిరిజన సంక్షేమం గురించి సభలో మాట్లాడటం విడ్డూరం. నిజానికి శాసనసభ్యులు, మంత్రులు, యంపీలు అందరూ తమ నియోజక వర్గాల అభివృద్ది పట్ల, తమ ప్రజల బాగోగుల పట్ల కనీసం 50 శాతం శ్రద్ధ చూపినా నేడు సభలో ఈ విభజన చర్చ జరిగే ఉండేదే కాదు. కానీ, ఎంతసేపు రాజకీయాలు, ఓట్లు, సీట్లు, అధికారం, పదవుల కోసమే తాపత్రయపడే నేతల వలననే నేడు రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చిందని చెప్పక తప్పదు.