TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజకీయ కేంద్రబిందువైన 'తిరుపతి

Published on: Sat May 12, 2012 11:50AM

రాష్ట్ర రాజకీయాలకు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రబిందువైంది. ఈ అసెంబ్లీ స్థానానికి ఉఅరిగే ఉప ఎన్నిక ప్రధానపార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఏమైనా సరే గెలవాలని అన్ని పార్టీలూ ప్రచారంలో తమ శక్తులను వొడ్డుతున్నారు. ముఖ్యంగా ఈ స్థానంలో కాంగ్రెస్, తెలుగుదేశం, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య తిముఖపోటీ ఖాయమని తేలింది.

 

అధికార కాంగ్రెస్ పార్టీ తరపున ఈ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా ఎం.వెంకటరమణ రంగంలో ఉన్నారు. ముఖ్యమంత్రి సొంత (చిత్తూరు)జిల్లా కావటం వల్ల ఈ స్థానంలో విజయం సాధించాలని ఆయన పట్టుదలగా ఉన్నారు. అందుకే తన సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డిని కూడా ఈ నియోజకవర్గంలో తాను స్వయంగా రాలేనప్పుడు తన తరపున వ్యవహారాలూ చక్కబెట్టాలని ఆదేశించారు. అసమ్మతి నాయకుల బుజ్జగింపులో సిఎం సోదరుడు తలమునకలయ్యారు. అయితే ప్రచారంలో భాగంగా తిరుపతిలో కాలుమోపిన సిఎంకు కాంగ్రెస్ సీనియర్ ఎంపి డాక్టర్ చింతామోహన్ తనదైన శైలిలో స్వాగతం పలికారు. టిటిడి మాజీ ఛైర్మన్ ఆదికేశవుల నాయుడుతో చర్చలు జరిపి మాజీ ఎమ్మెల్యే మోహన్ ను కాంగ్రెస్ పార్టీలోకి ఆయన తీసుకువచ్చారు. అలాగే శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్.వి. నాయుడు సహకారంతో మద్దతును కూడగట్టడంలోనూ విజయం సాధించారు.

ఇంతే కాకుండా డాక్టర్ చింతా మోహన్ బి.ఎస్.ఎన్.ఎల్. లో పనిచేస్తున్న బలమైన రాజకీయ చరిత్ర ఉన్న చెర్లోపల్లి ఆదినారాయణను పార్టీలోకి ఆహ్వానించారు. ఆదినారాయణ 500 మందితో సిఎం సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఎమ్మెల్యే పదవికి ఇచ్చిన రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానంలో పిఆర్పీ కేడర్ ను ఆకర్షించేందుకు డాక్టర్ చింతా, సిఎం సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఇలా చేరికలతో పార్టీ బలాన్ని పెంచుకుంటే విజయం సాధించటం సులభమని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.

 

 

అయితే ఇదే స్థానం నుంచి తెలుగుదేశంపార్టీ తరపున చదలవాడ కృష్ణమూర్తి పోటీలో ఉన్నారు. ఈయన కూడా అందరికీ భిన్నమైన శైలిలో ప్రచారం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగా ఈయన బి.ఎస్.ఎన్.ఎల్. కార్యాలయంలో ఉద్యోగుల మద్దతు కోరి ఇసి కంట్లో కూడా పడ్డారు. చదలవాడకు ఒక్క అవినీతి మచ్చ కూడా లేదని దేశం నేతలు తమ ప్రచారంలో ఓటర్లకు వివరిస్తున్నారు. ఈయన తరపున ప్రచారంలో ఉన్న తెలుగుయువత మాజీ అధికార ప్రతినిధి కంకణాల రజనీకాంత్ నాయుడు తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడాలని కోరుతూ కాంగ్రెస్, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలు ఎలా అపవిత్రతను ఆపాదించాయో తెలియజేసే కరపత్రాలను ముద్రించి ఓటర్లకు పంపిణీ చేశారు. చదలవాడకు మద్దతుగా ముస్లిం సామాజికవర్గంలో బలమైన నాయకునిగా ముద్రపడ్డ రియాజ్ భాషా కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈయన తన సామాజిక ఓట్లను తెలుగుదేశంపార్టీ వైపు తిప్పగాలరని ఆ పార్టీ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి.

 

ఈ రెండు పార్టీలకూ తామేమీ తీసిపోమని మొన్నటివరకూ తమ అధినేత జగన్ ను ప్రచారంలో ఉపయోగించుకున్న వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తమ నేతలను రంగంలోకి దించుతోంది. ఈ పార్టీ తరపున భూమన కరుణాకర రెడ్డి రంగంలో ఉన్నారు. ప్రస్తుతం సాక్షిపత్రిక అకౌంట్ల సీజ్ తదితర అంశాలు కాంగ్రెస్ దగాకోరు రాజకీయానికి నిదర్శనమంటూనే ఈ ఎన్నికల తరువాత కాంగ్రెస్ అయోమయంలో పడటం ఖాయమని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ప్రచారంలో ఆ పార్టీ నేత లక్ష్మీపార్వతి కూడా పాల్గొని ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ తరపున సిఎం పర్యటిస్తున్నందున మరికొందరు నాయకులను రంగంలోకి దించేందుకు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ ప్రణాళిక రూపొందించుకుందని తెలిసింది. ఏదేమైనా తిరుపతి అసెంబ్లీ నియోజక వర్గం మూడు పార్టీల రాష్ట్ర నాయకుల రాకపోకలతో రద్దీగా మారింది. ప్రచారం ఊపందు కుంది. వలసలూ ప్రారంభమయ్యాయి. దీంతో సెమీఫైనల్ స్టేజ్ కు ఎన్నికలు చేరుకున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.