TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పుష్ప సినిమా తరహాలో గంజాయి రవాణా... అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

Published on: Mon May 11, 2026 8:25PM

 

పుష్ప సినిమాను తలపించేలా గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు కూకట్‌పల్లి స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT), పటాన్‌చెరు పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. ముత్తంగి వద్ద ORR సమీపంలో వాహనాలను అడ్డగించి తనిఖీలు చేపట్టగా భారీగా ఎండు గంజాయి బయటపడింది. ఈ ఘటనలో ఏడుగురు అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

మహారాష్ట్రకు చెందిన మనీషా పడ్వాల్, ఒడిశాకు చెందిన ట్రిబ్యూన్‌తో పాటు ప్రతాప్ హరిదాస్ పవార్ (24), ఆనంద్ మయప్ప హోవల్ (34), బాలాజీ గణేష్ హోన్మణి (35), రోహిత్ హోవల్ (27), చందన్ షిప్వే ఔదుంబర్ (46), రంజీత్ రాజేందర్ గడగే (27) మరియు ఒక మైనర్ కలిసి పుష్ప సినిమా తరహాలో గంజాయి రవాణాకు ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

డీసీఎం వాహనం అడుగు భాగంలో గంజాయిని దాచిపెట్టి, పైభాగంలో ఖాళీ కూరగాయల ప్లాస్టిక్ ట్రేలను అమర్చి ఎవరికి అనుమానం రాకుండా తరలించే ప్రయత్నం చేశారు. ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి మహారాష్ట్రలోని సోలాపూర్‌కు గంజాయి తరలించేందుకు ప్రణాళిక రూపొందించారు. డీసీఎంకు ముందు ఒక కారుతో పైలట్, వెనుక మరో కారుతో ఎస్కార్ట్ ఇస్తూ రవాణా చేస్తున్నారు.

తనిఖీల సమయంలో డీసీఎం వాహనం పోలీసుల దృష్టికి రావడంతో అనుమానం వ్యక్తం చేశారు. మొదట ఖాళీ ప్లాస్టిక్ ట్రేలు మాత్రమే కనిపించినప్పటికీ, పోలీసులు వాటిని తొలగించి తనిఖీ చేయగా కింద భాగంలో ప్యాకింగ్ చేసిన గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

అయితే పరిస్థితిని పసిగట్టిన మనీషా పడ్వాల్, ట్రిబ్యూన్ అక్కడి నుంచి పరారయ్యారు. మిగతా ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితుల వద్ద నుంచి రూ.2 కోట్ల విలువైన 400 కిలోల ఎండు గంజాయి, ఒక DCM (ఐషర్) వాహనం, ఒక ఎర్టిగా కారు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

NDPS చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు శేరిలింగంపల్లి జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. డ్రగ్స్ సరఫరాపై సమాచారం ఉంటే డయల్ 100 లేదా సైబరాబాద్ NDPS ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్ 7901105423, వాట్సాప్ 8712663333 నంబర్లకు సమాచారం ఇవ్వాలని డీసీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.