(టి కప్పులో) తుఫాను… ఆధార్ వివాదం!

మనకు రోజూ కనిపించేవి ప్రతిపక్షం వర్సెస్ అధికార పక్షం గొడవలే! లేదంటే… సినిమా వాళ్ల కాంట్రవర్సీలు, క్రికెటర్ల ఎఫైర్లు వగైరా వగైరా! కానీ, ఈ మధ్య కాలంలో అలాంటి రెగ్యులర్ గోలతో కాకుండా వెరైటీగా ఆకట్టుకున్న వివాదం… ఆధార్ భద్రత! ఇందులో ప్రతిపక్షం వర్సెస్ అధికార పక్షం అనటానికి పెద్దగా ఏం లేదు. ఎందుకంటే, ఆధార్ మొదలు పెట్టింది ఈనాటి ప్రతిపక్షం కాంగ్రెస్! యూపీఏ హయాంలో హస్తం పార్టీనే ఆధార్ కు తెరతీసింది. ఇప్పుడు ఎన్డీఏ సర్కార్ కొనసాగిస్తోంది. అయితే, ఎన్ని ఆరోపణలు వచ్చినా బీజేపీ మాత్రం ఆధార్ పై వెనక్కి తగ్గటం లేదు. అది సాధ్యం కాదు కూడా! ఇప్పటికే కోట్లాది మంది ఆధార్ తీసేసుకున్నారు. ఎన్నో పథకాలు ఆధార్ తో అనుసందానం అయిపోయాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆధార్ ఇప్పుడు ప్రభుత్వానికి, ప్రజలకి నడుమ ప్రధాన ఆధారం అయిపోయింది. కానీ, ఇదే సమయంలో వరుసగా రోజుకోసారి సోషల్ మీడియాలో ఆధార్ దుమారం రేగుతోంది! అదే ఆందోళనకరం.

 

 

ఆధార్ జారీలో, నిర్వహణలో లోపాలున్నాయని చాలా మంది ఆరోపిస్తూ వస్తున్నారు. అయితే, చాలా వరకూ దాన్నెవరూ సీరియస్ గా పట్టించుకోలేదు. ఇండియాలో డబ్బులు పెడితే ఏదైనా ఎక్కడైనా ఎవరికైనా దొరికిపోతుందని మనకు ముందే తెలుసు! కాబట్టి ఎవ్వరూ పెద్దగా షాకవ్వలేదు. మన దగ్గర శ్రద్ధగా కష్టపడితే పాస్ పోర్ట్ లు కూడా ఎన్నంటే అన్నీ జారీ అయిపోతుంటాయి. ఆధార్ సంఖ్య లీకైతే మాత్రం ఏంటిలే అనుకున్నారు సామాన్యులు!

బయట పెద్దగా పట్టించుకోకున్నా సోషల్ మీడియాలో గొడవ మాత్రం బాగానే జరిగింది ఆధార్ పైన. ఒకవైపు ఆధార్ పకడ్బందీగా వుందని ఆధార్ జారీ చేసే సంస్థ చెబుతోంటే మరో వైపు అంతా డొల్లేనని నెటిజన్లు, హ్యాకర్లు వాదిస్తూ వచ్చారు. వీరందరికీ మాంచి ఛాలెంజ్ విసిరి ఒక్కసారి కాక పుట్టించారు రామ్ సేవక్ శర్మ. ఆయనెవరో మామూలు వాడైతే పెద్ద గోల జరిగేది కాదు. ఆయన ప్రస్తుత ట్రాయ్ ప్రధానాధికారి! గతంలో ఆధార్ జారీ యూఐడీఏఐకి కూడా బాస్ గా పని చేశాడు! ఆయన ఆధార్ వ్యవస్థపై వున్న నమ్మకంతో తన నెంబర్ ట్విట్టర్ లో పెట్టాడు. అంతే కాదు, ఆ ఆధార్ తో తనకు ఎలాంటి హాని చేయగలరో చేయండని సవాల్ విసిరాడు!

 

 

ఆర్ఎస్ శర్మ ఛాలెంజ్ తో రెచ్చిపోయిన నెటిజన్లు ఆయన ఫోన్ నెంబర్, ఇంటి అడ్రస్ లాంటి చాలా వివరాలు బహిర్గతం చేశారు. చివరకు, ఒకరు శర్మగారి అకౌంట్లో ఒక రూపాయి డిపాజిట్ చేశారు! ఇంత రచ్చ జరిగినా ఆర్ఎస్ శర్మ తనకు హాని ఏం చేయలేకపోయారని తొడ గొట్టాడు! తన అకౌంట్లో రూపాయి పడితే అది లాభమేనని సమర్థించుకున్నాడు!

శర్మ చెప్పినట్టు ఆధార్ నెంబర్ లభించినా ఎవ్వరూ ఆయనకు హాని చేయలేకపోయారు. అది నిజమే. కానీ, అసలు ఇంత రచ్చెందుకు ? ఆయన ఆవేశంగా తన నెంబర్ పబ్లిక్ లో పెట్టడం ఎందుకు? చివరకు, ఆధార్ కార్డులు ఇచ్చే యూఐడీఏఐ సంస్థ తన ట్విట్టర్ అకౌంట్లో జనాన్ని హెచ్చరించింది. ఎవ్వరూ ఆధార్ నెంబర్ పబ్లిక్ లో పెట్టకూడదని చెప్పింది. సవాళ్లు విసరొద్దని అంటూ శర్మకి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చింది!

 

 

మొత్తం మీద మాజీ ఆధార్ ప్రాదికార సంస్థ బాస్ సృష్టించిన తుఫాన్ టీకప్పులో ముగిసిపోగా… మళ్లీ కొన్ని గంటల్లోనే తాజా ఆధార్ వివాదం మొదలైంది. చాలా మంది మొబైల్ ఫోన్లలో ఆటోమేటిక్ గా ఆధార్ కాల్ సెంటర్ నెంబర్ అప్ డేట్ అయిపోయిందట! అంటే, మీ ఫోన్లో మీరు ఫీడ్ చేయకుండా ఆధార్ అనే పేరుతో కాంటాక్ట్ సేవ్ అయిపోతుంది! ఇదెలా? ప్రస్తుతానికైతే యూఐడీఏఐ దీనిపై స్పందించలేదు. ఆధార్ కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబర్ ఎలా జనాల ఫోన్లలోకి వచ్చిందో చెప్పలేకపోతోంది. మరో వైపు హ్యాకర్లు మాత్రం గట్టి ప్రశ్నిస్తున్నారు. ఆధార్ లో వున్న ప్రైవెసీ ఇంతేనా అంటున్నారు!

 

ఏదైనా ఒక వ్యవస్థ రూపుదిద్దుకుంటున్నప్పుడు అనేక లోటుపాట్లు సహజమే. ఆధార్ కూడా అలా కొన్ని లోపాలతో వుండవచ్చు. అలాగని ఆధార్ నే కాదని వద్దనలేం. అదీ ఇంత మంది ఆధార్ తో అనుసంధానం అయ్యాక. కాబట్టి ప్రభుత్వం ఆధార్ ను మరింత పటిష్ఠ పరిచే చర్యలు తీసుకోవటం ఉత్తమం. ఇలాంటి సమస్యలే ఓటర్ ఐడీ కార్డుల జారీలో కూడా మొదట్లో వచ్చాయి. ఇలాంటి టెక్నికల్ ఆరోపణలే ఈవీఎంలపై మన అపోజీషన్ లో వుండే పార్టీలు చేస్తుంటాయి. కాబట్టి ఆరోపణలన్నీ సీరియస్ గా తీసుకోకున్నా జాతియ, వ్యక్తిగత భద్రతలకు భంగం కలగకుండా మాత్రం ప్రభుత్వం చూడాలి. అందుకు , ఏం చేస్తే ఆధార్ మరింత సేఫ్ గా మారుతుందో ఆలోచించాలి. మనసుంటే మార్గం వుంటుంది.