మోదీని చూస్తే కేసీఆర్‌కు భయం

 

తెలంగాణలో ఎన్నికల తేదీ దగ్గర పడటంతో ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తాజాగా  టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ కేసీఆర్ మీద, టీఆర్ఎస్ మీద విమర్శల వర్షం కురిపించారు. దేశంలో సిగ్గు, శరంలేని వ్యక్తి సీఎం కేసీఆర్‌ ఒక్కరేనని అన్నారు. రాజకీయాలను నీచాతినీచంగా దిగజార్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. ప్రజాప్రతినిధులనే కాదు.. మీడియాను కూడా కేసీఆర్‌ వదల్లేదని, తెలంగాణలో జర్నలిజం విలువలకు కేసీఆర్‌ పాతరేశారని విరుచుకుపడ్డారు. తెలంగాణలో ఎక్కువగా మోసపోయింది జర్నలిస్టులే. జర్నలిస్టులకు వందకు వంద శాతం అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను ఎందుకు నిలబెట్టుకోలేదో కేసీఆర్‌ సమాధానం చెప్పాలి. ఏ రాజకీయ నేత వ్యవహరించని విధంగా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారు. గర్వంతో ఆయన‌ ఎవరినీ లెక్కచేయడం లేదు అని విమర్శించారు. 

ఎంతో మంది కష్ట ఫలితమే తెలంగాణ అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర విభజనను ఎంతో మంది అడ్డుకున్నారు. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌ విషయంలో చాలామంది విభజనను అడ్డుకున్నారు. తెలంగాణ ఇవ్వడం ఎంత కష్టమో ఆలోచించాలి. కష్టతరమైనా సోనియా తెలంగాణ ఇచ్చారని, సోనియా లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదని కొనియాడారు. సోనియాగాంధీ వల్లే రాష్ట్రం సాధ్యమైందని కేసీఆరే స్వయంగా ఒక సందర్భంలో అన్నారని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటును ఎంఐఎం వ్యతిరేకించింది. అలాంటిది ఇప్పుడు అదే ఎంఐఎంతో కేసీఆర్‌ దోస్తీ అంటున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన ఘనత కేసీఆర్‌దే. అధికారంలోకి రాగానే దళిత ముఖ్యమంత్రి హామీని అటకెక్కించి తానే ఆ స్థానంలో కూర్చొన్నారు. రాజకీయ విలువలు కుప్పకూలిపోయే విధంగా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారు. టీఆర్ఎస్ పాలనలో దేశంలోనే అత్యంత అవినీతి తెలంగాణలో జరిగింది అని విమర్శించారు.

24 గంటల కరెంటు ఇస్తున్నానని చెబుతున్న కేసీఆర్‌.. ఎక్కడ విద్యుత్‌ ప్రాజెక్టులు కట్టారు.. ఎక్కడ విద్యుదుత్పత్తి చేశారని ప్రశ్నించారు. దేశమంతా ఇప్పుడు మిగులు విద్యుత్‌ ఉందన్నారు. ఇలాంటి సమయంలో 24 గంటల విద్యుత్‌ ఇవ్వడం పెద్ద విషయం కాదని అన్నారు. కొత్తగా ఒక్క యూనిట్‌ ఉత్పత్తి చేసిన పవర్‌ ప్రాజెక్ట్‌ గురించి చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్క యూనిట్‌ కూడా ఉత్పత్తి చేయలేని దద్దమ్మలు తండ్రీకొడుకులని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఒక్కటే కాదు చుట్టు పక్కల రాష్ట్రాలన్నీ మిగులు విద్యుత్‌ రాష్ట్రాలేనని, 24 గంటల కరెంట్‌ కేసీఆర్‌ ఘనత కాదని ఉత్తమ్ పేర్కొన్నారు. రైతుబంధు మొదటి నాలుగేళ్లు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఎన్నికలు వస్తున్నాయనే రైతుబంధు పథకం పెట్టారని విమర్శించారు. 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే కౌలు రైతులకు రైతుబంధు సాయం చేస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు.

దుర్మార్గులు మళ్లీ గద్దెనెక్కితే సామాన్యులకు బతుకుండదని అన్నారు. కేసీఆర్‌కు అధికార దాహం తలకెక్కిందని విమర్శించారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా కేసీఆర్‌ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాలుగున్నరేళ్ల క్రితం చెప్పింది ప్రజలు మరిచిపోతారని ఇప్పుడు కేసీఆర్‌ కొత్త హామీలు ఇస్తున్నారు. మేం ఏడాది నుంచి నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెబుతూ వస్తున్నాం. దానిపై కేసీఆర్‌, కేటీఆర్‌ విమర్శలు చేశారు. దక్షిణాది బడ్జెట్‌ మొత్తమైనా సరిపోదని ఎద్దేవా చేశారు అని గుర్తుచేశారు. అసెంబ్లీ రద్దు రోజు ఎవరు ఎవరితో జట్టు కడితే మాకేంటి అన్న వ్యక్తి ఇప్పుడు ఎందుకు వణుకుతున్నారు? అని నిలదీశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో తాము పొత్తుపెట్టుకుంటే మీకెందుకు భయమని కేసీఆర్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇస్తానంటే చంద్రబాబు అడ్డుపడ్డారా?, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానంటే అడ్డుపడ్డారా?, దళితులకు సీఎం పదవి ఇస్తానంటే చంద్రబాబు పడ్డారా? అని ప్రశ్నించారు. ఎల్‌.రమణ, కోదండరామ్‌, చాడ వెంకటరెడ్డి ఆంధ్రావాళ్లా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఓ బ్రోకర్‌ అని విమర్శించారు. మోదీని చూస్తే కేసీఆర్‌కు భయం. విభజన చట్టంలో ఉన్న రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ గురించి అడిగే సత్తా లేదు. సాగునీటి ప్రాజెక్టుల నుంచి కమీషన్లు తీసుకుని ఎన్నికలకు వెళుతున్నారు. మిషన్‌ భగీరథ కింద లక్ష ఇళ్లకైనా నీళ్లిచ్చారా? కేవలం కమీషన్ల కోసమే పనిచేశారు అని విమర్శించారు. డిసెంబర్‌ 11న మహాకూటమి గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్‌ 12న తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడుతుందని, కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు, కేటీఆర్‌ అమెరికా పోవడం ఖాయమని ఉత్తమ్‌ అన్నారు.