TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేసీఆర్ ఫాంహౌజ్ దగ్గర రచ్చబండ రగడ.. రేవంత్ రెడ్డి హౌజ్ అరెస్ట్? 

Published on: Mon Dec 27, 2021 7:42AM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌజ్ ఉన్న మెదక్ జిల్లా ఎర్రవల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది.  ఎర్రవల్లిలో రచ్చబండ కార్యక్రమానికి పిలుపునిచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ నిరసనకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నేతలు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తరలివస్తున్నారు. అయితే రచ్చబండకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. నిర్వహించి తీరుతామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్‌లు, అరెస్ట్‌లు చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. ఆయనను హౌజ్ అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టులు చేశారు. రేవంత్‌రెడ్డి రచ్చబండ కార్యక్రమానికి పోలీసులు అడ్డంకులు సృష్టించారు. ఎర్రవల్లికి వెళ్లకుండా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. దుబ్బాకలో ఆరుగురు, భూంపల్లిలో ఐదుగురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్ధిపేటలో పలువురు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు.

కొన్ని రోజులుగా  తెలంగాణ రాజకీయాలన్ని ప్రస్తుతం వరి సాగు, వరి ధాన్యం కొనుగోళ్లపైనే నడుస్తున్నాయి. వరి ధాన్యం కొనుగోలు అంశంపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోమారు టీఆర్ఎస్ సర్కారుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతుల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆటలాడుతున్నాయని ఆరోపించారు.  కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తోన్న మోడీ సర్కారుతో టీఆర్ఎస్ కుమ్మక్కయిందని ఆరోపించారు. రైతులకు అన్యాయం చేసి ఇంకా గద్దెపై ఉంటారా? అంటూ ఆగ్రహం వెలిబుచ్చారు.ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని చెప్పిన కేసీఆర్.. తన సొంతపొలంలో పండించిన వరి ధాన్యాన్ని ఏ ఐకేపీ సెంటర్ లో అమ్మారో చెప్పాలని 
రేవంత్ రెడ్డి నిలదీశారు. మీ భూములు పండితే సరిపోతుందా..? రైతులను రాజును చేస్తామన్న మాటలు ఏమయ్యాయి? అంటూ నిలదీశారు. వరి పండించొద్దంటున్న టీఆర్ఎస్ నేతలు ఊళ్లోకి వస్తే చెప్పుతో కొట్టాలని  రేవంత్ రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం వింత వైఖరి అవలంబిస్తోందని ధ్వజమెత్తారు. 

వరి వస్తే ఉరే అన్న కేసీఆర్ సొంత వ్యవసాయక్షేత్రంలో 150 ఎకరాల్లో యాసంగి వరి పండిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అలాంటిది రైతుల పొంటను ఎలా కొనరో చూస్తాం అని వ్యాఖ్యానించారు. రైతుల కుటుంబ సభ్యుల కడగళ్లు వింటుంటే రోజుల తరబడి అన్నం కూడా సహించడంలేదని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబరు 27న  మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లిలో కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రచ్చబండ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. వెంకటాపురం-ఎర్రవల్లి మధ్యలో ఉన్న కేసీఆర్ వ్యవసాయక్షేత్రంలో 150 ఎకరాల్లో వరిసాగు చేస్తున్న వైనాన్ని మీడియా మిత్రులకు కళ్లకు కట్టినట్టు చూపిస్తానని రేవంత్ స్పష్టం చేశారు. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని, ఇంత స్వార్థపూరిత ఆలోచనతో ఉన్న వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలించడం మేలు చేస్తుందా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం తాను ఫొటోలు చూపిస్తున్నానని, ఇవేవీ బొబ్బిలి, విజయనగరంలో తీసిన ఫొటోలు కావని అన్నారు.